ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేస్తోన్న సిట్ దూకుడు మరింత పెంచింది. ఈ కేసులో కింగ్‌పిన్‌గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. రాజ శేఖర్‌రెడ్డి అరెస్టుతో ఈ వ్యవహారానికి సంబంధించిన డొంక మొత్తం కదులుతుందన్న వెర్షన్ వినిపిస్తోంది. సిట్ విచారణలో భాగంగా.. కేసిరెడ్డి నుంచి సిట్ వివరాలన్నింటినీ సేకరిస్తోంది. కేసిరెడ్డి చెబుతున్న సమాచారం ఆధారంగా దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. లిక్కర్ స్కామ్‌తో సంబంధం ఉందన్న ఏ ఒక్క ఆధారం దొరికినా మరింత మందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇలా ఈ కేసుతో లింక్ ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలని నిర్ణయించింది.
ఏపీ లిక్కర్ స్కామ్‌పై ఇప్పటి దాకా జరిగిన విచారణ ఒక లెక్క.. ఇప్పటినుంచి జరగనున్న విచారణ మరో లెక్క అన్నట్లుగా సిట్ అధికారులు విచారణను స్పీడ్ చేసినట్లు సమాచారం. ఎందుకంటే.. ఈ వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ గత ప్రభుత్వంలో సీఎంఓలో పనిచేసిన టీం పెట్టుకున్న పిటిషన్‌ను ఏపీ హైకోర్టు విచారించింది. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో, గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మరికొందరి అరెస్ట్ తప్పదన్న ప్రచారం జరుగుతోంది.
మరోవైపు లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సిట్ అరెస్ట్ చేసిన ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నప్పటికీ.. పెద్దగా సహకరించడం లేదని తెలుస్తోంది. కస్టడీలో సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకు రాజశేఖర్ రెడ్డి పొంత లేని సమాధానాలు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయినా సిట్ అధికారులు వదలకుండా.. సమాచారం సేకరించే పనిలో పడ్డట్లు సమాచారం. ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్‌కు స్కెచ్ వేసిన వాళ్లెవరు? ఆ టీమ్‌లో ఎవరెవరు ఉన్నారు.? వాళ్ల మధ్య ఉన్న సంబంధాలేంటి? ఈ స్కామ్‌లో మొత్తం ఎంత మేరకు నగదు లావాదేవీలు జరిగాయి.? ఆ మద్యం విధానంలో భాగంగా మొత్తం ఎంత మద్యం సేల్ అయింది? ఈ మొత్తం వ్యవహారంలో మిగిలిన నిందితులెవరు? కీలక సాక్షిగా భావిస్తున్న విజయసాయిరెడ్డి చెప్పినదంతా నిజమేనా? వంటి ప్రశ్నలు వేస్తూ.. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి సమాచారం సేకరించే పనిలో పడింది సిట్. మరోవైపు.. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, చాణక్య ఆస్తుల వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. ఈ లిక్కర్ స్కామ్ జరిగిన సమయంలో నిందితుల పేరుమీద కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలివ్వాలని రిజిస్ట్రార్ శాఖ ఐజీకి కూడా ఇప్పటికే సిట్ లేఖలు పంపించింది. ఏపీతో పాటు తెలంగాణ ఐజీ రిజిస్ట్రార్‌కు కూడా సిట్ అధికారులు లేఖలు రాశారు. ఈ క్రమంలోనే కేసిరెడ్డి భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు సిట్ అధికారులు. మరోవైపు.. కేసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌ను కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసిరెడ్డి ఆర్థిక వ్యవహారాలన్నీ దిలీప్ చూశాడని సిట్ గుర్తించింది. మొత్తానికి ఏపీ లిక్కర్ స్కాం తేనెతుట్టె కదులుతోందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.