టెక్ దిగ్గజం గూగుల్ భారతదేశంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు సిద్ధమవుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లో ప్రకటనలు, సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రధానంగా ఈ ప్రభావానికి గురయ్యే అవకాశం కనిపిస్తోందంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా నిర్వహణ సామర్థ్యాన్ని పెంచే పునర్వ్యవస్థీకరణ ప్రయత్నాల్లో భాగంగా గూగుల్ ఈ చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇంజనీరింగ్ ఉద్యోగుల విషయంలో మాత్రం కొంత సానుకూలత చూపే అవకాశముందని సమాచారం.
బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలో లేఆఫ్స్ ప్రక్రియ వచ్చే వారం నుంచి ప్రారంభం కావొచ్చని అంచనా. గూగుల్ ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించకపోయినా, ఇటీవలి అంతర్జాతీయ పునర్వ్యవస్థీకరణ చర్యలు దీని వెనుక ఉన్న నేపథ్యంగా చెబుతున్నారు. భారతదేశంలో గూగుల్ సంస్థలో సుమారు 10వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది బెంగళూరు, హైదరాబాద్ కేంద్రాల్లోనే ఉన్నారు.
2024లో గూగుల్ తన ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించింది. ఇందులో ఆండ్రాయిడ్, పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్ వంటి ఉత్పత్తులు నిర్వహించేవారు. ఈ విభాగంలో వందలాది మంది ఉద్యోగులను తొలగించారు. 2023లో కూడా గూగుల్ ప్రపంచవ్యాప్తంగా 12వేల మంది ఉద్యోగులను తొలగించింది.
భారతదేశంలో టెక్నికల్ ఉద్యోగుల విషయంలో తక్షణ తొలగింపులకు బదులు ఇతర ఆదాయ మూలక ప్రాజెక్టులకు బదిలీ చేసే అవకాశం ఉందని సమాచారం.గూగుల్ ఇండియా ఇంజనీరింగ్ బృందాలు ప్రస్తుతం కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వంటి కీలక రంగాల్లో పని చేస్తున్నాయి. వీటిపై దృష్టి పెడుతూ, గూగుల్ భవిష్యత్తు వృద్ధికి కేంద్రంగా మార్చుతోంది.
ఈ యేడాది జనవరిలో గూగుల్ సంస్థ తమ ఉద్యోగులకు వాలంటరీ సెపరేషన్ పథకం ప్రవేశపెట్టింది. ఇందులో సెవరెన్స్ ప్యాకేజీలు, రీలొకేషన్ సపోర్ట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చర్యలు కంపెనీకి ఖర్చుల తగ్గింపు, వనరుల సమర్థవంతమైన వినియోగం కోసం చేపట్టామని అధికారులు చెబుతున్నారు.
గూగుల్‌తో పాటు అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు కూడా 2023–24లో వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ఆర్థిక మాంద్యం భయం, ఏఐ ఆటోమేషన్, వ్యాపార పునర్వ్యవస్థీకరణను కారణంగా చూపెట్టాయి. నాస్కామ్ నివేదిక ప్రకారం, 2024లో భారత ఐటీ రంగంలో 5 నుంచి 7 శాతం మంది ఉద్యోగాలు పోయాయి. ఇది యువ టెక్ నిపుణుల్లో భద్రతపై ఆందోళనను పెంచుతోంది.
లేఆఫ్స్ ప్రక్రియతో ఉద్యోగులలో ఒత్తిడి, భవిష్యత్ పట్ల అనిశ్చితి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగులు కొత్త అవకాశాల కోసం వెతకాల్సి రావచ్చు. అయితే ఇంజనీరింగ్ ఉద్యోగులకు మాత్రం అంతర్గత బదిలీలు కొంతమేరకు ఉరట కలిగించవచ్చంటున్నారు.
గూగుల్ ఇప్పుడు తన వ్యూహాన్ని ఏఐ, క్లౌడ్, డిజిటల్ అడ్వర్టైజింగ్ వంటి అధిక వృద్ధి అవకాశాలున్న రంగాలపై కేంద్రీకరిస్తోంది. ఈ దృష్టిలో భాగంగానే ఖర్చు తగ్గింపు, నిర్వహణ సామర్థ్యం పెంపునకు ఈ చర్యలు తీసుకుంటోంది. అయితే, ఈ పరిణామాలు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులను కూడా మానసికంగా ప్రబావం చూపించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.