- ఇద్దరు వ్యక్తుల అరెస్టు
- 233 ఫారిన్ లిక్కర్ బాటిల్స్ సీజ్
హైదరాబాద్ నగరంలో పెద్దయెత్తున ఫారిన్ లిక్కర్ బాటిల్స్‌ని పట్టుకున్నారు. 2003వ సంవత్సరం లేబుల్స్‌తో ఉన్న ఢిల్లీకి చెందిన ఈ 233 విదేశీ మద్యం బాటిళ్ళను బషీర్‌బాగ్ కేఫ్ బహార్ రెస్టారెంట్ సమీపంలో ఉన్న టాటా వాటర్ ఏజెన్సీ గోడౌన్ లో పట్టుకున్నారు. హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ బీ టీమ్ దాడి చేసి ఈ బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. ఎన్ఫోర్స్ బీ టీమ్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలోని బృదం గోదాములపై దాడి చేసి24 రకాల బ్రాండ్లకు చెందిన 233 ఫారిన్ మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం బాటిళ్ళు కలిపి 174.5 లీటర్ల మధ్యం ఉంటుందని ఎన్ఫోర్స్ బీ టీమ్ సభ్యులు చెపుతున్నారు. పట్టుకున్న మద్యం విలువ దాదాపు పది లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. మద్యం బాటిళ్ళతో పాటు ఒక కారును, 35వేల రూపాయల నగదు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఎప్పటి నుంచో మద్యం వ్యాపారం చేస్తున్న హరీష్ కుమార్ ఈర్వాణి అనే వ్యక్తికి గత మద్యం టెండర్లలో దుకాణం దక్కపోవడంతో ఢిల్లీ నుంచి విదేశీ మద్యాన్ని అక్రమంగా తెప్పిస్తూ బషీర్‌బాగ్ లో ఉన్న తన గోదాముల్లో నిల్వ ఉంచేవాడు. గడచిన 14 నెలలుగా ఢిల్లీ నుంచి ఫారిన్ లిక్కర్ తెప్పించి ఒక్కో బాటిల్ పై 15 వందల నుంచి రెండు వేల రూపాయల లాభాలను అర్జిస్తున్నట్లు విచారణలో వెల్లడయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు హరీష్ కుమార్ ఈర్వాణితో పాటు సికింద్రాబాద్ కు చెందిన విలియమ్స్ జోసెఫ్ లను అరెస్ట్ చేశారు. వీరిద్దరే కాకుండా ఢిల్లీకి చెందిన మద్యం వ్యాపారులు దీపక్, సునీల్, ధర్మబట్టిలపై కూడా కేసు నమోదు చేశారు.