తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ల్యాండ్‌మైన్ పేల్చారు. రొటీన్ కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. భారీ శబ్దంతో పేలిన ల్యాండ్‌మైన్ ధాటికి ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.
విశ్వసనీయ వర్గాల ప్రకారం, మావోయిస్టుల కదలికల సమాచారం ఆధారంగా వాజేడు – పేరూరు అడవుల్లో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో, మావోయిస్టులు వ్యూహాత్మకంగా మందుపాతర ఏర్పాటు చేసి, అక్కడికి పోలీసులు చేరిన క్షణంలోనే ల్యాండ్‌మైన్‌ను పేల్చారు. పేలుడు అనంతరం వెంటనే మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో, తీవ్రమైన అల్లకల్లోల పరిస్థితి సృష్టించారు.
ప్రమాదవశాత్తూ గాయపడిన పోలీసులను సమీప హాస్పిటల్‌కి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు వెంటనే అదనపు బలగాలను మోహరించారు. ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో పోలీసు శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. మావోయిస్టుల ఈ దుశ్చర్యను పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.