బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్ ఖ్యాతిని ఇనుమడింపజేశామని, ఆ క్రమంలోనే ఫార్ములా ఇ కార్ రేస్‌ను కూడా హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించి సఫలమయ్యామని, కానీ, ఆ ప్రయత్నాలకు గండికొట్టి రేవంత్‌రెడ్డి.. బద్నాం చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. అసలు ఫార్ములా ఇ కార్ రేస్ హైదరాబాద్‌కు, భారత్‌కు రాకుండా చేసిన రేవంత్‌రెడ్డిపైనే కేసు పెట్టాల్సి ఉందన్నారు. తనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత.. గురువారం రాత్రి ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా పలు అంశాలు బయటపెట్టారు.
గతంలో చంద్రబాబు కూడా హైదరాబాద్‌లో ఫార్ములా రేస్‌కోసం ప్రయత్నించారని, గోపన్‌పల్లిలో ఎఫ్-1 రేసు ట్రాక్ కోసం 580 ఎకరాల భూసేకరణ చేశారని కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. అక్కడ రేవంత్ రెడ్డికి కూడా భూములున్నాయన్నారు. రేస్ అనేది నాలుగు సంవత్సరాలు జరుగుతుందని తెలిపారు. ఎఫ్-1 రేస్‌పై నగరాల అభివృద్ధి ఆధారపడి ఉందని వెల్లడించారు. రేసింగ్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ రాకతో మరింత పాపులారిటీ వచ్చిందని తెలిపారు. 14 కీలక రంగాల్లో ఆటోమొబైల్ రంగాన్ని గుర్తించినట్లు తెలిపారు.
ఈవీ పాలసీ తీసుకురావాలని తమ ప్రభుత్వంలో అనుకున్నామని చెప్పారు. చంద్రబాబు పెట్టిన అప్పటి జీనోమ్ వ్యాలీ ఇప్పుడు పెద్ద వృక్షమైందని గుర్తుచేశారు. మొక్క ఒకరు నాటుతారు.. ఫలాలు భావితరాల వాళ్లు పొందుతారని అన్నారు. ఫార్ములా ఈ-రేస్ కుంభకోణంపై ఏదో కనిపెట్టామని లీకులు ఇస్తున్నారు. అసెంబ్లీలో చర్చ పెట్టాలని స్పీకర్‌ను అడిగాం. చర్చ చేయాలని సీఎం రేవంత్‌కు కూడా లేఖ రాశాం. దీనిపై చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జరిగింది తప్పు అని ధైర్యంగా నిరూపించగలరా? అని కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ ప్రశ్నించారు. అసలు జరిగిందేమిటో తెలంగాణ ప్రజలకు తెలియాలని.. కళ్లలో కళ్లు పెట్టి చూసి మాట్లాదే ధైర్యం కాంగ్రెస్ నేతల్లో ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు.
ఫార్ములా ఇ కార్ రేస్‌కు సంబంధించి 25 అక్టోబర్ 2022లో మొదటి అగ్రిమెంట్ జరిగిందని అన్నారు. రేస్ జరగాలంటే కొంత ఖర్చు అవుతుందని, అందుకే ఇతర కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్నామని కేటీఆర్ తెలిపారు. రేస్‌కు కేంద్రం సహకారం ఉందని కిషన్ రెడ్డి క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రేస్‌కు ఎంతో మంది ప్రముఖులు వచ్చారని గుర్తుచేశారు. ఈ రేస్‌కు ఖర్చు మొత్తం హెచ్‌ఎండీఏ పెట్టిందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగే ఏ కార్యక్రమం అయినా హెచ్‌ఎండీఏ దగ్గరుండి చూసుకుంటుందని తెలిపారు. హెచ్‌ఎండీఏ నుంచి రూ.35 కోట్ల వరకు ఖర్చు చేశామని అన్నారు. మొత్తం ఎఫ్-1 రేస్‌కు రూ.150 కోట్లు ఖర్చు చేస్తే.. రూ.700 కోట్ల లాభం వచ్చిందని చెప్పారు. అంతేకాదు.. ఆ రేస్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించామని అన్నారు. ఎలన్‌మస్క్‌ను కూడా తీసుకురావాలని ప్రయత్నం చేసినట్లు తెలిపారు.
తెలంగాణ రేస్ జరగాలంటే డబ్బు కట్టాలని 3వ తేదీ ఆగష్టు 2023లో తమకు మెయిల్ వచ్చిందని కేటీఆర్ అన్నారు. ఫార్ములా-ఈ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా కలిశారని, అప్పుడు రేస్ నిర్వహణ పట్ల రేవంత్ పాజిటివ్‌గా స్పందించారని చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. అంతేకాదు.. ఆ మీటింగ్‌లో దాన కిషోర్ కూడా ఉన్నారని అన్నారు. వచ్చే మూడేళ్లు కూడా హైదరాబాద్‌లో రేస్ నిర్వహిస్తామని ఫార్ములా-ఈచీఫ్ ప్రభుత్వానికి చెప్పారని అన్నారు. తర్వాత డబ్బులు కట్టలేదని రద్దు చేశారని తెలిపారు. ఇందులో అవినీతి ఎక్కడుందో తెలియడం లేదని అన్నారు. బట్టకాల్చి మీదేసే ప్రయత్నంలో భాగంగానే తనపై ఏసీబీ కేసు పెట్టారని ఆరోపించారు.