భారత రాష్ట్ర సమితి పార్టీలో అరెస్ట్ టెన్షన్ నెలకొంది. ఏక్షణంలో ఏ సమాచారం వినాల్సి వస్తుందోనన్న ఉత్కంఠలో బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఏకంగా బీఆర్‌ఎస్ కార్యాలయంలో హరీష్‌రావు సహా ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు. ఏసీబీ ఆఫీస్‌లో జరుగుతున్న పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తున్నారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీ రామారావు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్మలా ఈ-రేస్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారానికి పూర్తి బాధ్యత అప్పటి మంత్రి కేటీఆర్‌దే అన్న అభియోగాలతో ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఏసీబీ ఇచ్చిన నోటీసుల మేరకు కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం తన నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు కేటీఆర్. ఆ సమయానికి బీఆర్‌ఎస్ ముఖ్యనేత హరీష్‌రావు సహా పలువురు నేతలు, బీఆర్‌ఎస్ శ్రేణులు కేటీఆర్ ఇంటివద్దకు చేరుకున్నారు. కేటీఆర్ ఏసీబీ ఆఫీసుకు బయలుదేరి వెళ్లగానే నాయకులందరూ బీఆర్‌ఎస్ ఆఫీసుకు పయనమయ్యారు.
ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. ప్రత్యేకంగా నియమించిన బృందంలోని అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతిరాజ్, అడిషనల్ ఎస్పీ శివరాం శర్మ, డీఎస్పీ మాజిద్ ఖాన్ తదితరులు కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మరోవైపు.. బీఆర్‌ఎస్ ఆఫీసులో ఆపార్టీ ముఖ్యనేత హరీష్‌రావు సహా.. పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు భేటీ అయ్యారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్,ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి,పాడి కౌశిక్ రెడ్డి,మాజీ ఎంపీ మాలోత్ కవిత తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏసీబీ ఆఫీసులో జరుగుతున్న విచారణ తీరును మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. విచారణ తీరును సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు.