గురువారం అనంతపురం నగరంలో జరగాల్సిన డాకు మహరాజ్ ప్రీ రీలీజ్ ఈవెంట్‌ను రద్దు చేసినట్లు ఆ చిత్ర హిరో నందమూరి బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్ సంస్ధ నిర్మించిన డాకు మహరాజ్ ఈ సంక్రాతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం అనంతపురం నగరంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని సినిమా నిర్మాణ సంస్ధ తలపెట్టింది. ఈ కార్యక్రమానికి బాలకృష్ణతో పాటు మంత్రి నారా లోకేష్‌లు ముఖ్య అతిధులుగా హాజరవుతారని ప్రకటించారు. అయితే బుధవారం తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శన టిక్కెట్ల కౌంటర్ల దగ్గర తొక్కిసలాటలో ఆరు మంది భక్తులు మృతి చెందిన ఘటన జరిగిన నేపథ్యంలో ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు చేస్తున్నట్లు బాలకృష్ణ మీడియాకు మెసేజ్ లు చేశారు. పవిత్ర స్ధలంలో ఇటువంటి దురదృష్టకర సంఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని… ఇటువంటి పరిస్ధితుల్లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించడం భావ్యంకాదనే ఉద్దేశంతోనే ఈవెంట్‌ను రద్దు చేసుకున్నట్లు డాకు మహరాజ్ సినిమా టీమ్ ప్రకటించింది. ఇదిలాఉండగా తిరుమల తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందడం పట్ల నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
- Advertisement with us -