తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కన్నీరు పెట్టారు. వెక్కి వెక్కి ఏడ్చారు. ఆమెతో పాటు.. ఆమె భర్త కొండా మురళి కూడా కంటనీరు పెట్టుకున్నారు. మంత్రి ఇంట్లో పనిచేసే భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బంది కూడా విషాదంలో మునిగిపోయారు.
అయితే, మంత్రి కొండా సురేఖ కంట నీరు పెట్టుకోవడానికి కారణం ఆమె పెంపుడు కుక్క మరణించడమే. ఆమె అల్లారు ముద్దుగా చూసుకున్న పెంపుడు కుక్క హ్యాపీ ఆకస్మిక మరణంతో కొండా సురేఖ భోరున విలపించారు. కొండా సురేఖ కుటుంబం ప్రాణంగా చూసుకుంటున్న హ్యాపీ అనే పెంపుడు కుక్క హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయింది. ఇంట్లో మనుషులతో సమానంగా చూసుకుంటున్న ఆ మూగ జీవం చనిపోయేసరికి మంత్రి కొండా సురేఖ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
చనిపోయిన తన హ్యాపీకి మంత్రి కొండా సురేఖ ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హ్యాపీ హఠాన్మరణంతో సురేఖ కుటుంబీకులు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. గత కొన్నాళ్ళుగా హ్యాపీతో మధుర అనుభూతులను మంత్రి సురేఖ, ఆమె సిబ్బంది గుర్తుచేసుకుని దు:ఖించారు.