కన్నడ నటి రణ్యారావుని వలపన్ని పట్టుకున్న డీఆర్ఐ
కన్నడ నటి, డీజీపీ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్ర రావు కుమార్తె రణ్యారావును అక్రమంగా బంగారం తరలిస్తున్న కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో దిగిన రణ్యారావు 12 కోట్ల విలువైన బంగారు కడ్డీలు కలిగి ఉండటంతో అరెస్ట్ చేశారు. రణ్యారావు తరచు దుబాయ్ వెళ్లి వస్తుండటంతో ఆమెపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘాపెట్టాయి. ఆమెతో పాటు ఇద్దరు వ్యక్తులు బంగారు కడ్డీలతో నిండిన బ్రీఫ్కేసులను తీసుకెళ్తున్నారని డీఆర్ఐ కి సమాచారం అందింది. నిందితులు భద్రతా వలయాలను దాటి దాదాపుగా బయటకు వెళ్లబోతుండగా డీఆర్ఐ వారిని అడ్డుకుని సోదాలు చేయగా వారి వద్ద 14.2 కిలోల బరువున్న బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. దీంతో పోలీసులు హిరోయిన్ రణ్యరావుతో పాటు ఆమెతో ఉన్న ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. దీంతో పాటు బెంగళూరులోని రణ్యారావు ఇంటిలో కూడా డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆమె నివాసంలో కూడా రూ.2.67 కోట్ల విలువైన బంగారం దొరికింది. మొత్తం రూ.17.29 కోట్లు రికవరీ అయినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.