దేశ రాజధాని ఢిల్లీ.. నేరాల్లోనూ దేశానికి రాజధానిగా మారుతోందని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితిని గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ రాశారు. శాంతిభద్రతల సమస్యను వివరించేందుకు తనకు సమయం ఇవ్వాలని కోరారు. దేశంలోని అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీలోనే అత్యధికంగా మహిళలపై నేరాలు జరుగుతున్నాయని కేజ్రీవాల్ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. హత్యలు, దోపిడీలు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్రైమ్ రికార్డులను పరిశీలిస్తే ఢిల్లీ నేర రాజధానిగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు. పాఠశాలలు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు తరచూ వస్తున్నాయని, డ్రగ్స్ సంబంధిత నేరాలు 300 శాతానికి పైగా పెరిగాయని కేజ్రీవాల్ ఆ లేఖలో ఆందోళన వ్యక్తంచేశారు. రాజధానిలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, ఈ వైఫల్యాల కారణంగా ఢిల్లీకి రేప్ క్యాపిటల్, క్రైం క్యాపిటల్ అనే కొత్త పేర్లు కూడా వస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాజధానిలో నెలకొన్న పరిస్థితి గురించి మరింత స్పష్టంగా వివరించేందుకు సమయం ఇవ్వాలని కేజ్రీవాల్ అమిత్‌షాను కోరారు.