34.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

తీన్మార్ మల్లన్న చుట్టూ కేసీఆర్‌ టీమ్‌?

తెలంగాణలో ప్రాంతీయవాదం కనుమరుగవుతోంది. ఇప్పుడు కులవాదం బయటకు వచ్చింది. రాష్ట్రంలోని అన్ని పార్టీలూ బీసీ జపం చేస్తున్నాయి. బీసీ నినాదం బలంగా వినిపిస్తోంది. రాజకీయంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిని గమనిస్తే.. వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలూ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం అనివార్యంగా కనిపిస్తోంది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాలకు, బీసీ కుల సంఘాల నాయకులకు డిమాండ్ ఊహించనంతగా పెరుగుతోంది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో.. బీసీ నినాదం భుజానేసుకొని.. రెడ్లను, కాంగ్రెస్ నేతలను నానా బూతులు తిట్టిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను ఆకట్టుకునే పనిలో పడింది బీఆర్ఎస్ పార్టీ. ఈ వ్యవహారంలో చాలా వేగంగా పావులు కదిపిన కేసీఆర్, తన మేనల్లుడు హరీష్ రావు ద్వారా మల్లన్న చుట్టూ కొందరు బీఆర్ఎస్ బీసీ నాయకులను ఉండేలా చేశారు. ఫలితంగా ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే తీన్మార్‌ మల్లన్నను ఫిక్స్‌ చేసేందుకు వ్యూహం రచించింది బీఆర్‌ఎస్‌. వాస్తవానికి తెలంగాణలో రాజకీయాలు చూస్తే.. ఎవరు మాటలు ఎక్కువగా మాట్లాడ గలుగుతారో, ఎవరు మాటలను తూటాలుగా ప్రత్యర్థులపైకి అస్త్రాలుగా విడిచిపెడతారో.. వాళ్లే తెలంగాణలో రాజకీయం చేయగలుగుతారనేది విశ్లేషకుల మాట. మిగతా చూస్తే.. మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి ఉండదు. నాయకుడు అనే వాడు ఏం చేసినా చేయకపోయినా అద్భుతంగా మాట్లాడితే చాలు.. తెలంగాణలో పొలిటికల్ లీడర్‌గా సెటిల్‌ కావొచ్చు. కేసీఆర్ అడ్వాంటేజ్ కూడా అదే. అద్భుతమైన మాటకారి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. ఆ మాటలతోనే ఉద్యమం నడిపాడు. ఆ మాటలతోనే పదేళ్ల పాటు రాష్ట్రంలో పాలన సాగించాడు. ఇదే ఫార్ములా ఫాలో అయ్యి రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు.

ఇటు.. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కూడా మీడియాలో ఓ చిన్న ఉద్యోగాన్ని వదులుకొని ఈ నోరు పెట్టుకునే ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూడా అయ్యాడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి పది కారణాల్లో తీన్మార్ మల్లన్న కూడా ఒకడని తానే చెప్పుకుంటున్నాడు కూడా. కేసీఆర్ కుటుంబంపై తీన్మార్‌ మల్లన్న నెగిటివ్ ప్రచారం.. సోషల్ మీడియాలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి చాలా ఉపయోగపడిందని చెప్పుకుంటారు. తీన్మార్ మల్లన్న అనే అనామకుడికి దాదాపు అన్ని రకాలుగా సహకరించి ఎమ్మెల్సీ స్థాయికి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి అనేది లోగుట్టు. అయితే, ఎమ్మెల్సీ అయ్యాక చింతపండు నవీన్ కాంగ్రెస్ పార్టీకి అడ్డం తిరిగాడు. బీసీ నినాదం పేరుతో రెడ్డి సామాజిక వర్గం నేతలను నానా బూతులు తిట్టడం మొదలు పెట్టాడు. దీంతో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలామంది రేవంత్ రెడ్డిని నిందిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. తీన్మార్ మల్లన్న అనే వాడిని తయారు చేసింది రేవంత్ అని, ఇప్పుడు అతనే కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నాడని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

ఇక, ఇప్పుడు తాజా రాజకీయాలను గమనిస్తే.. ఒకప్పుడు తీన్మార్ మల్లన్నపై దాడులు చేయించి, కేసులు పెట్టించి, జైల్లో వేసి నానా రకాలుగా హింసించిన కేసీఆర్.. ఇప్పుడు హఠాత్తుగా వ్యూహం మార్చాడట. చింతపండు నవీన్ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి అడ్డం తిరగ్గానే.. అతన్ని తన వైపు లాక్కోవాలని కేసీఆర్‌ ప్లాన్‌ వేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆ పనిని తన మేనల్లుడు హరీష్‌రావుకు అప్పజెప్పాడని చర్చ నడుస్తోంది. ఈ ప్లాన్‌ మేరకే .. హరీష్ రావు అనుచరుల్లో కొందరు బీసీ నాయకులు వెంటనే తీన్మార్‌ మల్లన్న చెంతకు చేరారట. తెలంగాణలో ఇక ప్రత్యేక రాష్ట్ర వాదన పనిచేయదని, ఆంధ్రా వాళ్ళని తిట్టి తెలంగాణలో ఓట్లు వేయించుకునే ప్లాన్ ఇప్పుడు ఇక వర్క్ అవుట్ కాదని, రాబోయే రోజుల్లో జనాన్ని కులం పేరుతోనే డివైడ్ చేయాల్సిన అవసరం ఉందని, అందుకే బీసీ నినాదం ఎత్తుకోవడం ద్వారా జనాభాలో అత్యధికంగా ఉన్న వారి ఓట్లను కొల్లగొట్టాలని అన్ని పార్టీలు డిసైడ్ అయ్యాయి. ఈ వ్యూహాల్లో భాగంగానే హరీష్ రావు అనుచరులు కొందరు తెలివిగా మల్లన్న పక్కన చేరారని అంటున్నారు. ఒకప్పుడు కేసీఆర్ ఆఫీసులో పనిచేస్తూ.. అవినీతి ఆరోపణలతో గెంటి వేయబడిన ఒక బీఆర్‌ఎస్‌ బీసీ కార్యకర్త. .ఏకంగా ఇప్పుడు మల్లన్న పక్కన చేరాడని చెబుతున్నారు. అతనితో పాటు మరికొందరు బీసీ మాస్క్ తో తీన్మార్ మల్లన్నను కవర్ చేస్తున్నారట. అలాగే చింతపండు నవీన్ మూమెంట్స్ అన్నీ ఎప్పటికప్పుడు హరీష్ రావుకు చేరవేస్తున్నారని అంటున్నారు. బీసీ ఉద్యమానికి కావలసిన నిధులు సమీకరించడం, ఇతరత్రా సహకారం బీఆర్ఎస్ ద్వారానే అందుతోందని చెబుతున్నారు. చింతపండు నవీన్ పక్కన బీఆర్ఎస్ కార్యకర్తలు, హరీష్ రావు అనుచరులను చూసి తెలంగాణ బీసీ నాయకులు షాక్ తింటున్నారని చెబుతున్నారు. పదేళ్ల కేసీఆర్ కుటుంబ పాలనను, కేసీఆర్‌ అవినీతిని ఎండగట్టి.. ఆ కేసుల్లో జైలుకు కూడా వెళ్ళిన తీన్మార్‌ మల్లన్న… చివరికి ఇలా వాళ్లతోనే చేతులు కలవడం చూసి రాజకీయ నాయకులే ఆశ్చర్యపోతున్నారు. బీసీ సభలకు, ఇతరత్రా కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పుడు అర్థమైందంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఈసారి బీసీలను రెచ్చగొట్టి.. మల్లన్న ద్వారానే ఆ పని చేయిస్తున్నాడనేది చాలామంది చర్చించుకుంటున్నారు. ఏ ఆయుధాన్ని అయితే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కేసీఆర్‌పై ప్రయోగించాడో, అదే ఆయుధాన్ని ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రధానంగా రేవంత్ రెడ్డిపై ప్రయోగించబోతున్నారని అనుకుంటున్నారు. మొత్తానికి చూస్తే.. ఈ పరిణామాలన్నీ గమనిస్తే.. తీన్మార్ మల్లన్న రేవంత్ ఉచ్చు నుంచి బయటపడి కేసీఆర్ ఉచ్చులో చిక్కుకున్నాడని అంటున్నారు .

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com