అవకాశం.. ఒక్క అవకాశం కావాలంటూ కసితో బ్యాటు పట్టుకొని డగౌట్‌లో కూర్చున్న ఓ ఆటగాడికి చాన్స్ వస్తే ఎలా ఉంటుంది? తనలో లావాలా ఎగిసిపడుతున్న ఆటను ప్రపంచానికి చూపించాలనుకుంటున్న ఆ ప్లేయర్‌కు ఛాన్స్ వస్తే.. అదే కరుణ్ నాయర్ తన బ్యాటుతో ప్రపంచానికి చూపించాడు.
సరిగ్గా 1077 రోజులైంది కరుణ్ నాయర్ ఐపీఎల్‌లో ఆడే అవకాశం వచ్చి. దేశవాళీల్లో ఎన్ని సంచలనాలు సృష్టించి ఎప్పటికప్పుడు తనలోని ఆటను మెరుగు పర్చుకుంటున్నా.. తనకు ఓ అవకాశం రాలేదు. కానీ ఎప్పుడు దిగులు పడలేదు.. కుంగిపోలేదు. కానీ 2022లో ఓ పోస్ట్ పెట్టాడు.. డియర్ క్రికెట్.. నాకు ఇంకొక అవకాశం ఇవ్వు అని.. ఆ అవకాశం 2025లో వచ్చింది. అంతే బ్యాట్‌తో పూనకం పుట్టించాడు.. బౌలర్లను హడలెత్తించాడు.. గ్రౌండ్‌లో పరుగుల వరద పారించాడు.
టీమ్‌లో డుప్లెసిస్ గాయంతో ఓ ఖాళీ ఏర్పడింది. అనూహ్యంగా కరుణ్‌కు పిలుపొచ్చింది. బుమ్రా లాంటి దిగ్గజ బౌలర్ ఈగోను కూడా హర్ట్ చేశాడు కరుణ్. 2021 తర్వాత బుమ్రా బౌలింగ్‌లో ఒక ఓవర్‌లో రెండు సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్ లేడు. కానీ ఆ ఫీట్‌ను సాధించాడు కరుణ్. అందుకే మ్యాచ్ ముగిసిన తర్వాత బుమ్రా దగ్గరికి వెళ్లాడు. కానీ వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ ఇంకా శాంతించలేదు. దీంతో కాస్త హాట్ డిబేట్ జరిగినట్టు కనిపిస్తోంది. ఆటలో ఇవన్నీ సహజం. మళ్లీ రేపటి రోజు గ్రౌండ్‌లో కలుసుకొని వారే నవ్వులు చిందిస్తారు. దీని కోసం ఫ్యాన్స్ మళ్లీ కొట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఏదేమైనా కరుణ్ నాయర్ చేసిన 89 పరుగుల గురించి దేశమంతా చర్చించుకుంటుంది. మరి ఇదే జోరును నెక్ట్స్ మ్యాచ్‌లో కొనసాగిస్తాడా? అలా కొనసాగిస్తూనే టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడా? అనేది చూడాలి.