23.3 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

పోలీసు దిగ్భంధనంలో కర్రెగుట్టలు

దేశమంతా పహెల్గామ్ ఉగ్రదాడి పర్యవసానాలపై దృష్టి సారించగా దండకారణ్యంలో పోలీసు బలగాలు మావోయిస్టులను అష్టదిగ్భందనం చేశాయి. చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో వందల కొద్ది బలగాలు   ‘సీజ్ ఎరాడికేషన్ మిలటరీ ఆపరేషన్’ను నిర్వహిస్తున్నాయి. ఆపరేషన్ వెంటనే ఆపాలని మావోయిస్టులు  పిలుపునిచ్చారు.  శాంతియుత చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారని..  మా పార్టీ ఎల్లప్పుడూ శాంతి చర్చలకు సిద్ధంగా ఉంటుందని కేంద్ర కమిటీ తరపున ఓ సందేశాన్ని మీడియా ద్వారా పంపించారు.

బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో మావోయిస్టు ఆగ్రనేత హిడ్మాను బలగాలు చుట్టుముట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. మావోయిస్టులకు సురక్షిత స్థావరంగా ఉన్న కర్రెగుట్టలను అటునుంచి చత్తీస్‌గఢ్ పోలీస్ బలగాలు ఇటువైపు నుంచి తెలంగాణ పోలీస్ బలగాలు చుట్టుముట్టాయి. కర్రెగుటల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇరు రాష్ట్రాల సంయుక్త ఆపరేషన్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగలనుందని… అందుకే శాంతి చర్చలకు మావోయిస్టులు పిలుస్తున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారతదేశంలో నక్సలిజంను అంతం చేయడానికి మార్చి 31, 2026 నాటికి గడువు పెట్టుకున్నారు.  ఈ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా బలగాలు పనిచేస్తున్నాయి. బస్తర్ డివిజన్‌లో 2024 జనవరి నుండి 310 మంది మావోయిస్టులు హతమయ్యారు, 2021 నుండి మొత్తం 385 మంది హతమయ్యారు. ప్రస్తుతం బస్తర్‌లో కేవలం 400 మంది సాయుధ క్యాడర్‌లు మాత్రమే మిగిలి ఉన్నారని బస్తర్ ఐజీ పి. సుందర్‌రాజ్  ప్రకటించారు.

మావోయిస్టు సెంట్రల్ కమిటీ కూడా బలహీనపడింది, కేవలం 12-14 మంది కమాండర్‌లు మాత్రమే చురుకుగా ఉన్నారు. 2024లో చత్తీస్‌గఢ్‌లో 287 మావోయిస్టులు హతమయ్యారు, 1000 మంది అరెస్టయ్యారు, 837 మంది లొంగిపోయారు. 2025 ఏప్రిల్ 19న, సుక్మా మరియు బీజాపూర్ జిల్లాల్లో 33 మావోయిస్టులు లొంగిపోయారు. దీంతో సుక్మాలోని బడేసెట్టి గ్రామం నక్సల్-రహితంగా ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, విద్య, విద్యుత్, ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా స్థానికుల మద్దతు సంపాదించే ప్రయత్నం జరుగుతోంది. నక్సల్-రహిత గ్రామాలకు రూ.1 కోటి అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నారు. చత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ, నిధులు, ఆర్థిక మూలాలను అడ్డుకోవడం, ఇంటెలిజెన్స్ బలోపేతం చేయడంపై  కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దృష్టి సారించింది.

మావోయిస్గులపై ఒత్తిడి పెరగటంతో పౌరహక్కుల సంఘాల నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శాంతి చర్చల ఆంశం ప్రస్తావించారు. నక్సల్స్ సమస్యను కాంగ్రెస్ భద్రతా సమస్యగా కాకుండా సామజిక కోణంలో చూస్తోందని… శాంతిచర్చలకు తమ వంతు సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ఆంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం(ఏప్రిల్ 28న) మాజీహోంమంత్రి జానారెడ్డితో సమావేశం అయ్యారు.

గతంలో చెన్నారెడ్డి హయంలో నక్సల్స్ పై నిషేధం ఎత్తివేయటంతో బలం పుంజుకున్నారని… రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నక్సల్స్ పై సానుబూతి చూపిస్తే మళ్లీ ముప్పు తప్పదని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com