-
ఏప్రిల్ 16న విజయవాడలో ప్రదానం
నాటక కళారంగంలో విశిష్ట సేవలకుగాను ఈ ఏడాది మొత్తం 110 మంది కళాకారులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కందుకూరి పురస్కారాలను అందించనుంది. వీరిలో రాష్ట్రస్థాయిలో ముగ్గురు, జిల్లా స్థాయిలో 107 మంది ఎంపికయ్యారు.
ఈ పురస్కారాలు ఏప్రిల్ 16న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రదానం కానున్నాయి. ఇదే రోజు ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి 177వ జయంతి సందర్భంగా “తెలుగు నాటక రంగ దినోత్సవం” జరుపుతున్నారు.
పురస్కారాల ఎంపిక కోసం సినీ, నాటక రచయిత డా. బుర్రా సాయి మాధవ్ నేతృత్వంలోని 11 మంది సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఎంపిక విధానం పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
రాష్ట్రస్థాయి కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారం కింద లక్ష రూపాయల నగదు,
జిల్లా స్థాయి కందుకూరి విశిష్ట పురస్కారం కింద పదివేల రూపాయల నగదు బహుమతి అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ వేడుకకు నాటక రంగానికి చెందిన ప్రముఖులు, కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని వెల్లడించారు.