అటు.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల్లో ప్రస్తావించారు. ఎంపీ లక్ష్మణ్ రాజ్యసభ జీరో అవర్‌లో ఈ విషయాన్ని లేవనెత్తారు. 400 ఎకరాల హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా భూముల అమ్మకానికి సిద్ధమైందని, విశ్వవిద్యాలయానికి కూటాయించిన భూములను కాపాడాలని కోరారు. యూనివర్సిటీకి కేటాయించిన భూములను మార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీలు కోరారు. ఇదే అంశంపై లోక్‌సభ జీరో అవర్‌లోనూ తెలంగాణ ఎంపీలు లేవనెత్తారు. అనంతరం కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, నగేశ్ తదితరులు ఉన్నారు.
మరోవైపు.. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించిన వివాదంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలంటూ వన ఫౌండేషన్ ప్రతినిధులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే, ఇప్పటికే దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ ఏడవ తేదీ చేపట్టనున్నట్లు న్యాయస్థానం తెలిపింది. అయితే, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని ఫౌండేషన్ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దీంతో, కేసు తీవ్రత దృష్ట్యా రేపు విచారణ చేపట్టేందుకు హైకోర్టు అంగీకరించింది.