ఈనెల 11వ తేదీ నుంచి మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వేం చెన్నకృష్ణా రెడ్డి, వేం పురుషోత్తం రెడ్డి స్మారక తెలంగాణ రాష్ట్రస్థాయి మొట్ట మొదటి ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు మోడర్న్ కబడ్డీ ఫౌండర్, నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ కుంభం రాంరెడ్డి, తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సీహెచ్ ఐలయ్య తెలిపారు. మోడర్న్ కబడ్డీ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం స్టేషన్‌లోని జిల్లా పరిషత్ స్కూల్ గ్రౌండ్‌లో మూడు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఈనెల 11, 12, 13 తేదీల్లో ఈ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి ఈ టోర్నమెంట్‌లో జిల్లా స్థాయి టీమ్‌లు పాల్గొంటాయని వారు తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ నుంచి మోడర్న్ కబడ్డీ టీమ్ పాల్గొంటుందన్నారు. ఈ టోర్నమెంట్‌లో ఇంకా పేర్లు నమోదు చేయించుకోని జిల్లా టీమ్‌లు పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు.