జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వీ.రామ సుబ్రమణియన్ ని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నీరజ్ కుమార్ బన్సోడ్ జస్టిస్ రామ సుబ్రమణియన్ కు సమాచారం అందించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2023లో జూన్ మాసంలో పదవీవిరమణ చేసిన సుబ్రమణియన్ అంతకు ముందు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా చేశారు. తమిళనాడులోని మన్నార్ గుడి ప్రాంతానికి చెందిన జస్టిస్ సుబ్రమణియన్ మద్రాస్ లా కళాశాలలో న్యాయ శాస్త్రం అభ్యసించారు. తొలుత మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన సుబ్రమణియన్ ఆతరవాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన పదవీకాలంలో దాదాపు 102 కేసుల్లో ఆయన తుది తీర్పులు ఇచ్చారు. మూడు సంవత్సరాల పాటు జస్టిస్ రామ సుబ్రమణియన్ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ గా కొనసాగుతారు.