37.2 C
Hyderabad
Thursday, May 14, 2026

Live Video

spot_img

సాధారణ ఎన్నికలను తలపిస్తోన్న జర్నలిస్ట్‌ హౌజింగ్‌ సొసైటీ ఎలక్షన్స్

హైదరాబాద్‌లో జర్నలిస్టుల ఎలక్షన్స్‌ హీట్‌ నెలకొంది. ఆరు దశాబ్ధాల చరిత్రకలిగిన ది జర్నలిస్ట్‌ కో ఆపరేటివ్‌ హౌజింగ్‌ సొసైటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు ప్యానళ్లు పోటాపోటీగా ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నాయి. ఎవరి వాదనలు వారు వినిపిస్తూ సభ్యులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రధానంగా సొసైటీ సభ్యులకు ఇళ్ల స్థలాల కేటాయింపులే ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారాయి.

ఈనెల 18న పోలింగ్‌ :

ఈనెల 18వ తేదీన జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీకి పోలింగ్‌ జరగనుంది. వాస్తవానికి ఈ సొసైటీకి మేనేజింగ్‌ కమిటీ పదవీకాలం నాలుగేళ్ల క్రితమే పూర్తయ్యింది. ఆ సమయంలోనే ఎన్నికలు జరగాల్సి ఉండగా.. సొసైటీలోని స్థలాల కేటాయింపు జరిగిన జర్నలిస్టులు, స్థలాల కేటాయింపు జరగని జర్నలిస్టుల మధ్య వివాదం నెలకొంది. అలాటీస్‌ కొందరు కోర్టుకు వెళ్లడం, నాన్‌ అలాటీస్‌ దాన్ని సవాల్‌ చేయడంతో చివరకు న్యాయస్థానం ఇప్పటిదాకా సభ్యత్వం ఇచ్చిన వాళ్లందరూ జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీలో సభ్యులేనని తీర్పు చెప్పింది. నిబంధనల ప్రకారం సభ్యత్వం తీసుకున్న వాళ్లందరూ ఓటు వేయడానికి అర్హులేనని కరాఖండిగా వెల్లడించింది. అంతేకాదు.. ఇప్పటికే ఎన్నికలు ఆలస్యం కావడంతో వెంటనే హౌజింగ్‌ సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలని కూడా ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో, జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీకి న్యాయస్థానం ఇచ్చిన గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇళ్ల స్థలాలే అందరి ఎజెండా :

ఇక, కొన్నేళ్లుగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో సందిగ్ధం నెలకొనడం, జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీకి స్థలం ఉన్నప్పటికీ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొర్రీలు వేయడంతో జర్నలిస్టులు అప్పటినుంచీ ఇళ్ల స్థలాల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇటీవలే జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్‌ హౌజింగ్‌ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపుల ఆర్డర్లను అందజేసింది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీ సభ్యులందరూ ఇళ్ల స్థలాల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈసారి జర్నలిస్టు హౌజింగ్‌ సొసైటీ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో హీట్‌ పుట్టిస్తున్నాయి. అలాటీస్‌ వర్సెస్‌ నాన్‌ అలాటీస్‌గా సభ్యులందరూ చీలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పోటీపోటీగా వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి మరీ క్యాంపెయినింగ్‌ చేపడుతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం మూడు ప్యానెళ్లు పోటీ చేస్తున్నాయి. గతంలో మేనేజింగ్‌ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులైన వెంకటాచారి, హష్మి నేతృత్వంలో అలాటీస్‌, నాన్‌ అలాటీస్‌ సంయుక్త ప్యానల్‌ ఓవైపు.. బ్రహ్మాండభేరి గోపరాజు నేతృత్వంలో నాన్‌ అలాటీస్‌ ప్యానల్‌ మరోవైపు.. ఈ రెండుప్యానళ్లు కాకుండా.. ప్రోగ్రెసివ్‌ ప్యానల్‌ ఇంకోవైపు ఎన్నికల్లో పోటీపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ప్యానల్‌లకు సంబంధం లేకుండా మరికొందరు ఇండిపెండెంట్లు కూడా పోటీలో నిలిచారు.

వెంకటాచారి, హష్మి ప్యానల్‌ ఏం చెబుతోంది?

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలే ప్రధాన ఎజెండాగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరికి వాళ్లు సభ్యులకు ఇళ్లస్థలాలు కేటాయించేందుకు తామే సమర్థులమని ప్రచారపర్వంలో పాల్గొంటున్నారు. అలాటీస్‌, నాన్‌ అలాటీస్‌ ఉన్న వెంకటాచారి, హష్మి ప్యానల్‌ సభ్యులు.. తమకు ఇంతకుముందు ఉన్న అనుభవంతో సభ్యులందరికీ ఇళ్లు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఉన్న సభ్యులందరికీ తమ హయాంలోనే సభ్యత్వం ఇచ్చామని, చివరి జనరల్‌ బాడీ సమావేశంలో నాన్‌ అలాటీస్‌ సభ్యుల ఇళ్ల స్థలాల కోసమే సొసైటీ ఫండ్‌ నుంచి రూ.4కోట్ల రూపాయలు పక్కనబెట్టామని ప్రచారం చేస్తున్నారు. తమను గెలిపిస్తే ప్రభుత్వంతో పోరాడి, సొసైటీ ఆర్థిక వనరులతో సభ్యులందరికీ ఇళ్ల స్థలాలు తమ హయాంలోనే ఇచ్చే ఏర్పాటు చేస్తామంటున్నారు.

నాన్‌ అలాటీస్‌ ప్యానల్‌ వాదన ఏంటి?

ఇక, గోపరాజు నేతృత్వంలోని నాన్‌ అలాటీస్‌ ప్యానల్‌ సభ్యులు అసలు ఈ పోరాటమే అలాటీస్‌, నాన్‌ అలాటీస్‌ మధ్య జరుగుతోందని, ఇన్నాళ్లుగా నాన్‌ అలాటీస్‌ను కొందరు అలాటీస్‌ ఇబ్బందిపెట్టారని, అలాంటప్పుడు నాన్‌ అలాటీస్‌ కోసం అలాటీస్‌ ఎలా కృషి చేయగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. నాలుగేళ్లుగా నాన్‌ అలాటీస్‌కు సభ్యత్వంకోసం, ఓటు హక్కు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని, తమ పోరాటం ఫలితంగానే ఇప్పుడు అందరికీ ఓటు హక్కు లభించిందని, న్యాయస్థానం మనందరికీ అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వివరిస్తున్నారు. నాన్‌ అలాటీస్‌కు ఇళ్ల స్థలాలు రావాలంటే.. నాన్‌ అలాటీస్‌ ప్యానల్‌నే గెలిపించాలని కోరుతున్నారు. అలాటీస్‌ను గెలిపించినా ప్రయోజనం ఉండదని, నాన్‌ అలాటీస్‌ బాధేంటో, హక్కులేంటో.. నాన్‌ అలాటీస్‌ ప్యానల్‌కు మాత్రమే అర్థమవుతుందని ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు.

ప్రోగ్రెసివ్‌ ప్యానల్‌ ఆరోపణలేంటి?

మరోవైపు.. ప్రోగ్రెసివ్‌ ప్యానల్‌ తమదైన రీతిలో ప్రచారం చేస్తోంది. వీరాంజనేయులు, మీస శ్రీనివాస్‌ నేతృత్వంలో ప్రచారం చేస్తోన్న ప్రోగ్రెసివ్‌ ప్యానల్‌.. అసలు అలాటీస్‌ ఇన్నాళ్లుగా నాన్‌ అలాటీస్‌కు మోసం చేశారంటున్నారు. అలాగే, నాన్‌ అలాటీస్‌ పేరుతో ప్యానల్‌ పెట్టుకున్న వాళ్లు.. సభ్యుల దగ్గర కోర్టు ఖర్చులకోసమంటూ డబ్బులు వసూలు చేసి లెక్కలు చూపించడం లేదని ఆరోపిస్తున్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు రావాలంటే ప్రోగ్రెసివ్‌ ప్యానల్‌కు మాత్రమే సాధ్యమని ప్రచారం చేస్తున్నారు.

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 దాకా పోలింగ్‌ :

ఇక, జర్నలిస్టు హౌజింగ్‌ సొసైటీలో మొత్తం 1389 మంది ఓటర్లున్నారు. వీరిలో 400కు పైచిలుకు అలాటీస్‌ ఉండగా.. 900 పైచిలుకు నాన్‌ అలాటీస్‌ ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో 9 మేనేజింగ్‌ కమిటీ సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. వీరిలో ఓపెన్‌ కేటగిరీలో ఆరు స్థానాలు, మహిళా కేటగిరీలో రెండు స్థానాలు, ఎస్సీ కేటగిరీలో ఒక స్థానం కోసం ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువరించారు. అయితే, ఆరు ఓపెన్‌ కేటగిరీ స్థానాలకోసం 21మంది పోటీ పడుతుండగా.. రెండు మహిళా స్థానాల కోసం ఐదుగురు పోటీ చేస్తున్నారు. ఇక, ఎస్సీ కేటగిరీలో ఉన్న ఒక స్థానం కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈనెల 18వ తేదీ బుధవారం జర్నలిస్ట్‌ కో ఆపరేటివ్‌ హౌజింగ్‌ సొసైటీకి పోలింగ్‌ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్న 3 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌లో ఓటువేసే సభ్యులందరికీ మూడు బ్యాలట్‌ పేపర్లు ఇస్తారు. జనరల్‌ కేటగిరీలో పోటీచేస్తున్న 21 మందిలో ఆరుగురికి ఓటు వేయాల్సి ఉంటుంది. మహిళా కేటగిరీలో పోటీ చేస్తున్న ఐదుగురిలో ఇద్దరికి ఓటు వేయాలి. అలాగే, ఎస్సీ కేటగిరీలో పోటీచేస్తున్న ముగ్గురిలో ఒకరికి ఓటు వేయాలి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com