- తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలు చేసినదెంత?
- ప్రస్తుత ప్రభుత్వాలు చెబుతున్నదెంత?
- ఆర్బీఐ నివేదికలపై ఎవరి భాష్యాలు వారివే
తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలు పరిమితికి మించి అప్పులు చేసేసి ఖజానా నడ్డి విరిచాయా? లక్షలు కోట్లల్లో అప్పులు చేసేసి ఖజానాను కొల్లగొట్టేశారని, ఇప్పుడు ఒక్కో ఇటుక పేర్చుకుంటూ మళ్లీ ఆర్థిక పునర్నిర్మాణం చేస్తున్నామని రెండు తెలుగురాష్ట్రాల్లో ప్రస్తుత ప్రభుత్వాలు పదే పదే ప్రకటిస్తున్నాయి.. ఈ ప్రకటనలు రాజకీయ ఉద్దేశాలతో చేసినవా? లేక నిజమేనా అనే సందేహం అందరికీ వస్తుంది. అయితే తాజాగా ఆర్బీఐ చేసిన ప్రకటన చూస్తే వాస్తవాలు తెలుస్తాయి.
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పెంత?
తెలంగాణలో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందని.. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఈ ప్రచారం విస్తృతంగా కనిపించింది. కేసీఆర్ పాలన అంతా అస్తవ్యస్తమని.. దుబారా ఖర్చులతో అనవసర వ్యయంతో అభివృద్ధి కుంటు పడిందని.. సంక్షేమ పథకాలకు సొమ్ము లేకుండా పోయిందని, అయినా శక్తి వంచన లేకుండా నెమ్మదిగా సర్దుకుంటూ వస్తున్నామని ఇటీవల సీఎం రేవంత్ ప్రకటించారు. అయితే ఆర్బీఐ అందుకు పూర్తి భిన్నమైన నివేదికను బయటపెట్టింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పటి ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ.3,22,499 కోట్లు.. మాత్రమేనని ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఆర్బీఐతో ప్రభుత్వం నేరుగా ఎఫార్బీయం రూపంలో తీసుకున్న అప్పు మాత్రమే రూ.3,22,499 కోట్లు ఉందని, ఇక కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు, పెండింగ్ బిల్లులు అన్నీ కలిపి 7 లక్షల కోట్లు పైచిలుకని లెక్కలతో సహా చెపుతున్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. అయితే బీఆర్ ఎస్ పాలనలో జీఎస్డీపీ, తలసరి ఆదాయం, సాగు, అటవీ విస్తీర్ణం, ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయని ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన హ్యాండ్ బుక్ ఆప్ స్టాటిస్టిక్స్ 2024 ప్రకారం తేలింది. విభజన సమయంలో ఉమ్మడిరాష్ట్ర జీఎస్ డీపీ 4.3 లక్షల కోట్లు ఉంటే 2023,24 లకి అది రూ.15 లక్షల కోట్లకు పెరిగింది. తలసరి ఆదాయం రూ.1,03,8889 కోట్లు ఉండగా అది పదేళ్లలో రూ.3,56,564 కోట్లకు పెరిగింది. మూల ధన వ్యయం రూ.11,583 కోట్ల నుంచిరూ.78,611 కోట్లకు పెరిగింది అని ఆర్బీఐ నివేదికలు చెబుతున్నాయి. దీన్ని చూపించుకుని మేము పదేళ్ళలో ఇంత సంపద పెంచామని టీఆర్ఎస్ చెప్పుకుంటుంటే… అంతకు రెండింతలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
జగన్ ప్రభుత్వం చేసిన అప్పెంత?
అలాగే ఏపీ లో జగన్ ప్రభుత్వం పైనా ఎన్డీఏ కూటమి లక్షల కోట్లు అప్పులు చేసినట్లు ఆరోపణలు చేసింది. ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ప్రచారం ప్రధానంగా దీనిపైనే. ప్రధాని నుంచి, చంద్రబాబు, పవన్ కల్యాణ్ అందరూ ఒకే రకమైన ఆరోపణలు చేశారు.. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజన నాటి పరిస్థితుల్లోకి నెట్టేసిందని పదేపదే ఆరోపించారు. ఏపీలో ప్రతీ వ్యక్తి నెత్తిన తలా రూ.2 లక్షల అప్పు ఉందని కూడా ప్రచారం చేశారు.
అసలు లెక్కలివి…
ఐదేళ్లలో 14 లక్షల కోట్ల అప్పు జగన్ ప్రభుత్వం చేసేసిందని..ఊదరగొట్టారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు , బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలోనూ దానిని 9 లక్షలుగా చెప్పారు.. పైగా ఇంకా ఇతర లెక్కలు చూడలేదని.. అన్నీ చూశాక మరింత పెరిగే అవకాశం ఉందని చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజంటేషన్లతో నానా హంగామా చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఎఫ్ ఆర్ బీఎం పరిమితులకు లోబడే అప్పులు చేస్తున్నామని చెబుతూ వచ్చింది. అసలు అప్పులు తీర్చకుండా కొత్త అప్పులెలా పుడతాని కూడా ప్రశ్నించింది. చంద్రబాబు చేసి వెళ్లిన అప్పులన్నీ తీర్చి ఆపై తాము అవసరాలకు తగిన విధంగా ఆర్బీఐ రుణాలు వాడుకున్నామని తెలిపింది. జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.7,48,000 కోట్లు అప్పు చేయగా అందులో రూ.4,08,000 కోట్లు అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులే. 2014-2019 మధ్యకాలంలో చంద్రబాబునాయుడు హయాంలో ఏపీ వ్రుద్ధి రేటు 21.63 శాతం నుంచి 12.90 శాతానికి పడి పోయింది. అలాగే చంద్రబాబు హయాంలో ఏపీ జీఎస్ డీపీ 3 శాతం నుంచి రెండు శాతానికి పడిపోయింది. అలాగే జగన్ టైమ్ లో కోవిడ్ కష్ట కాలం వెంటాడి జీఎస్ డీపీ కాస్త తగ్గింది. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర రెవిన్యూ వందకోట్లు కాగా, జగన్ హయాంలో అది ఏడు వేల కోట్లకు పెరిగిందని వైసీపీ నేతలు కూడా గతంలో చెప్పారు.
అసలు ఎలా లెక్కిస్తారు?
అసలు రెవిన్యూ వసూళ్లు, రుణ వసూళ్లతో పాటు రుణ సమీకరణ ద్వారా పెరిగిన రాబడి కంటే ఆ ఏడాదిలో ఖర్చు చేసిన వ్యయం ఎక్కువగా ఉంటే అది ద్రవ్య లోటుగా చెప్పాలి. మామూలుగా అసలు వ్యక్తులైనా, రాష్ట్రాలైనా, దేశాలైనా పొదుపు చర్యలతో ఆదా చేసి దానిని పెట్టుబడికింద పెట్టడం అన్నది అసలు జరిగే పనికాదు. అది విధానం కూడా కాదు. కాబట్టి పరిమితంగా ఉండే ద్రవ్యలోటుని భూతద్దంలో చేసి దుష్ర్పచారం చేయాల్సిన అవసరం లేదు. కానీ శక్తికి మించిన అప్పులుచేసి అది చెల్లించాల్సిన బాకీలు ,వడ్డీలని మించిపోతే మాత్రం ఖచ్చితంగా అది భారంగానే చెప్పుకోవాలి.ఎఫ్ ఆర్ బీ ఎం చట్టం ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ద్యవ్ర లోటైనా రాష్ట్ర జీఎస్ డీపీకి మూడు శాతానికి మించ కూడదు.