జార్ఖండ్ లో ఇండియా కూటమి అధికారానికి చేరువ కావడంతో కాంగ్రెస్ సహా మిత్ర పక్షాల శిబిరాల్లో సంబరాలు మొదలయ్యాయి. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఝార్ఖండ్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి.
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. వారిలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారం చేయగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జార్ఖండ్ పరీశీలకుడిగా వ్యవహరించారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి వ్యూహం.. విడుదల చేయాల్సిన మేనిఫెస్టో రూపకల్పనలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఝార్ఖండ్ పిసిసి అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేష్ తో కలిసి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యూహ రచన చేశారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్కమార్క రాజధాని రాంచీలో మకాం వేసి పార్టీ నేతలను, ప్రచార కార్యక్రమాలను సమన్వయం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగిన నేతలను బుజ్జగించటంలో డిప్యూటీ సిఎం చొరవ తీసుకోవటం కూటమి గెలుపులో కీలకంగా మారింది.
బొకారో, రాంగడ్ జిల్లాల్లో భట్టి విస్తృతంగా పర్యటించారు. రెండు జిల్లాల్లో ఆరు నియోజకవర్గాలు ఉండగా ఐదింటిలో ఇండియా కూటమి జయకేతనం ఎగురవేసింది. ఆయా జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించిన భట్టి విక్రమార్క కూటమి నేతలను సమన్వయం చేసి ప్రచారం కొనసాగించారు.
ఎగ్జిట్ పో ల్స్ అంచనాలను తారుమారు చేస్తూ కూటమి గెలుపునకు కృషి చేసిన ఉప ముఖ్యమంత్రికి జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అభినందనలు తెలుపుతున్నారు.