పాన్ ఇండియా ఇతిహాస వైజ్ఞానిక చిత్రం జైహనుమాన్ బిగ్ అప్‌డేట్ వచ్చింది. హనుమాన్ పాత్రలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ సమర్పిస్తోన్న జై హనుమాన్ సినిమా.. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను వినూత్నంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుందన్నారు నిర్వాహకులు. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇండియాలో యూట్యూబ్‌లో అత్యధికంగా 5 బిలియన్ల మందికి పైగా వీక్షించి రికార్డ్ సృష్టించిన హనుమాన్ చాలీసా వీడియో ఆధ్యాత్మిక గాథను భారీ స్థాయిలో సినిమాగా తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అధునాతన సినిమాటిక్ టెక్నాలజీ, భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందిస్తోన్న ఈ సినిమా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందని సినిమా టీమ్ నమ్మకంగా చెబుతోంది.
జై హనుమాన్ ద్వారా భారతీయ సంస్కృతి మీద ఆధారపడి ఉన్న కథనాలను మరింత విస్తృతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం గర్వంగా భావిస్తున్నామని భూషణ్ కుమార్ చెప్పారు. జై హనుమాన్ వంటి ప్రాజెక్ట్‌ను రూపొందించడం గర్వకారణంగా ఉందని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వ్యాఖ్యానించారు. ఇక, దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. జై హనుమాన్ తన కలల ప్రాజెక్ట్ అని, పురాణ గాథలను ఆధునిక టెక్నాలజీతో మిళితం చేసి రూపొందిస్తున్నామని.. లార్డ్ హనుమాన్ స్ఫూర్తిని, ధైర్యాన్ని, భక్తిని ప్రతిబింబించే కథ అని చెప్పారు.