విజయవాడ కార్పొరేటర్లతో జగన్
ఈ సారి జగనన్న 2.o ను చూడబోతున్నారని… జగనన్న 2.o కొంచెం వేరుగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూపిస్తా అని అన్నారు. తొలి విడతలో ప్రతి అడుగు ప్రజలకు ఎంతో మంచి చేయాలనే ఆలోచనతో వేశానని… ప్రజలకు మంచి చేసే క్రమంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు కార్యకర్తలను పెడుతున్న కష్టాలు, బాధలు చూసి మీకోసం నేను నిలబడతా అని కార్యకర్తలకు జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తామని వాళ్ళు ఎక్కడ ఉన్నా తీసుకు వచ్చి చట్టం ముందు నిలబెడతా అని స్పష్టం చేశారు. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దొంగ కేసులు పెడతారు, బెదిరిస్తారా, జైల్లో పెడతారు.. అయినా భయపడాల్సిన పని లేదని కార్యకర్తలకు నేను అండగా నిలుస్తానని వైఎస్‌జగన్ తెలిపారు. మనం ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాం… 30 ఏళ్ళు పాలన చేస్తామన్నారు. సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పమంటున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి.. వాటిని తట్టుకుని నిలబడినప్పుడే మనం లీడర్లుగా ఎదుగుతామన్నారు. నా కథే ఉదాహరణగా తీసుకోండి… రాజకీయంగా ఎదుగుతున్నానని కాంగ్రెస్, టీడీపీ కలసి నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు.. అయినా నేను బయటకు వచ్చా… సీయం అయ్యా అని గుర్తు చేసుకున్నారు.