సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీల నాయకులు అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. తాజాగా ఏపీ మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు.
అల్లు అర్జున్ అరెస్టు, అంతకుముందు పరిణామాలపై వైఎస్ జగన్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అల్లు అర్జున్ అరెస్టు సరికాదన్నారు. జగన్ చేసిన ట్వీట్ సారాంశం చూస్తే.. ”హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను” అని వైఎస్ జగన్ ట్వీట్‌లో రియాక్ట్ అయ్యారు.