34.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

స్పీకర్‌పై జగదీష్‌ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు – శ్రీధర్‌ బాబు మందలింపు

తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్‌ రె్డ్డి చేసిన వ్యాఖ్యలపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కౌంటర్‌ ఇచ్చారు. గతంలో మంత్రిగా పనిచేసిన జగదీష్‌ రెడ్డి స్పీకర్‌ను బెదిరించేలా మాట్లాడటం సరైందేనా అని ప్రశ్నించారు. మీ తీరును ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. జగదీష్‌ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని శ్రీధర్‌ బాబు డిమాండ్‌ చేశారు. పదేళ్లలో మీరేం చేశారు? ఇప్పుడు ఏడాదిలో తామేం చేశామో ప్రజలకు చెప్పామని శ్రీధర్‌ బాబు అన్నారు. 14 నెలల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు.

అంతకు ముందు స్పీకర్‌పై జగదీష్‌ రెడ్డి అనుచితంగా మాట్లాడారు. ఆ సమయంలో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ తీర్మానం చర్చ సందర్భంగా మాజీ మంత్రులు వర్సెస్ మంత్రులుగా మాటల దాడి కొనసాగింది. ఈ సందర్భంలో స్పీకర్ ను ఉద్దేశించి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి.

గవర్నర్ ప్రసంగంపై జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. 36 నిమిషాల గవర్నర్ ప్రసంగంలో 360 అబద్ధాలు చెప్పించారని ఫైర్ అయ్యారు. ప్రసంగం చదివేటప్పుడు గవర్నర్ మనసు ఎంత నొచ్చుకుందోనని కామెంట్ చేశారు. రైతుల గురించి సభలో మాట్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విప్ శ్రీనివాస్ కలుగజేసుకొని గవర్నర్‌కు గౌరవం ఇవ్వాలని, ఇదేం పద్దతి అంటూ జగదీశ్ రెడ్డిపై మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించింది తాము కాదు.. కాంగ్రెస్ పార్టీనేనని జగదీశ్ రెడ్డి అన్నారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. బీఆర్ఎస్ వైఫల్యాలను తమ సభ్యులు చెప్పారని, గత పదేళ్లలో చేయలేనిది తాము ఏడాదిలోనే చేసి చూపించామని అన్నారు.

ఈ క్రమంలో స్పీకర్ కల్పించుకొని గవర్నర్ ప్రసంగంలోని అంశాలే మాట్లాడాలని సూచించారు. అయితే, స్పీకర్ వ్యాఖ్య పట్ల జగదీశ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా సాంప్రదాయాలకు ఏది విరుద్ధమో చెప్పాలి.. సభ స్పీకర్ సొంతం కాదు, ఈ సభ అందరిది అంటూ వ్యాఖ్యానించారు. స్పీకర్ స్పందిస్తూ తనను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్ధమని అనడంతో.. జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది.

జగదీశ్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సభకు కొద్దిసేపు వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయించారు. ఆ తరువాత మంత్రి శ్రీధర్ బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్ భేటీ అయ్యి సభలో జరిగిన గందరగోళంపై చర్చించారు. అయితే, సభలో జగదీశ్ రెడ్డి కామెంట్స్ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి శ్రీధర్ బాబు తీసుకెళ్లారు. సస్పెండ్ చేసే విషయాన్ని చర్చించారు. అయితే, జగదీశ్ రెడ్డి క్షమాపణలు చెప్పకపోతే సభ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్ తదితరులు స్పీకర్‌ను తన ఛాంబర్ లో కలిశారు. సభలో జరిగిన గందరగోళంపై చర్చించారు. జగదీశ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా స్పీకర్ సీటును కించపరచలేదని, గౌరవంగానే స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడారని పేర్కొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com