విలేకరుల చిట్ చాట్ లో ఎమ్మెల్సీ కవిత ఆవేదన…
తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న లక్షా 75వేల ఎకరాలను తాకట్టు పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్ కి సంబంధించిన నిర్ధిష్టమైన ఆధారాలు నా దగ్గర ఉన్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. సోమవారం ఉదయం ఆమె తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కవిత మాట్లాడుతూ టీజీఐఐసీని ప్రైవేటు లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీఓను విడుదల చేసిందని జీఓ కాపీలను విడుదల చేశారు. కంపెనీ హోదాను మార్చడం ద్వారా మరిన్ని వేల కోట్ల రూపాయల రుణం పొందాలనేది ప్రభుత్వం ఆలోచనని ఆమో విమర్శించారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్సే్ంజిలో తాకట్టు పెట్టే కుట్ర జరుగోందని కవిత ఆరోపించారు. కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని కవిత నిలదీశారు. స్టాక్ ఎక్సేంజ్ లో నష్టం జరిగితే తాకట్టు పెట్టిన తెలంగాణ భూముల భవితవ్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు. వెంటనే టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. గతంలో చేసిన అప్పుల్లో కేవలం 80 వేల కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం చెల్లించిందని మిగిలిన లక్షకోట్లు ఎక్కడకి వెళ్లాయని కవిత ప్రశ్నించారు. ఈ లక్షకోట్లను పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లించి వారి నుంచి 20 శాతం కమీషన్ తీసుకున్నారని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. నేను చెప్పింది తప్పైతే ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వేల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ సర్కార్ ఒక్క మంచి పని కూడా చేయలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
మీడియా సమావేశం ముగిసిన తరువాత కవిత కొద్ది సేపు విలేకరులతో ముచ్చటించారు. తాను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నేను పర్యటించిన 47 నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్, ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలనే నేను చెప్తున్నానన్నారు. ఉన్న పరిస్ధితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానన్నారు. పార్టీపై ప్రజల్లో రోజు రోజుకూ నమ్మకం పెరుగుతోందని, ఈ సమయంలో నాపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. నాపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయన్నారు. ఆర్నెల్లు జైల్లో ఉన్నది సరిపోదా నన్ను ఇంకా కష్టపెడతారా అని ఆవేదన చెందారు. నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానన్నారు. నాపై జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీ స్పందిస్తుందనే అనుకుంటున్నానని కవిత విలేకరులతో జరిపి చిట్ చాట్ లో తన అభిప్రాయం వ్యక్తం చేశారు.