ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు, పద్మవిభూషణ్ గ్రహీత ఆగాఖాన్ (88) మంగళవారం పోర్చుగల్‌లో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆగాఖాన్ ఫౌండేషన్, ఇస్మాయిలీ మత సమాజం వెబ్‌సైట్‌లో ప్రకటించారు. ఆయన వారసుడిని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఆగాఖాన్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆగాఖాన్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఇస్మాయిలీ ముస్లింల వారసుడిగా ఆధ్యాత్మిక గురువుగా నియమితులైన కరీం అల్-హుస్సేనీ ఆగా ఖాన్ IV గారి మరణం మానవాళికి తీరని లోటు అని ముఖ్యమంత్రి అన్నారు. గొప్ప సామాజిక వేత్త, మానవతావాదిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును అందుకున్నారని అన్నారు. ఆగాఖాన్ నెట్ వర్క్ ద్వారా వివిధ దేశాల్లో ఆస్పత్రులు, విద్యా, సాంస్కృతిక సంస్థలను నెలకొల్పి మానవాళికి తన సేవలను అందించారని గుర్తు చేశారు. పేదరిక నిర్ములన, వారసత్వ సంపద పరిరక్షణకు, వైద్య సేవలు, విద్యా రంగంలో ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివని, హైదరాబాద్ కేంద్రంగా ఆగా ఖాన్ సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంతో గొప్పవని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆయన జీవితాంతం మానవ జాతి గౌరవం పెంచే ఉన్నత విలువలను ఆచరించారని కొనియాడారు. వారి వారసులకు, కుటుంబసభ్యులకు, అనుచరులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.