టీమిండియా మాజీ ప్లేయర్.. ప్రస్తుతం ఐసీసీకి సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జవగళ్ శ్రీనాథ్ ఓ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. సమయం గడుస్తున్న కొద్ది ఈ వివాదం పెరుగుతుందే కానీ.. ఏమాత్రం తగ్గడం లేదు. నిజానికి జవగళ్ శ్రీనాథ్ ఆట అద్భుతం. అతను వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు.మొత్తంగా అతని రికార్డ్ చాలా క్లీన్. కానీ అతని కెరీర్‌లో తొలిసారి ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అతని తీసుకున్న నిర్ణయం చుట్టూ రచ్చ జరుగుతోంది.
పుణె వేదికగా జరిగిన ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కంకషన్ సబ్‌స్టిట్యూట్ ఆప్షన్‌ను ఉపయోగించుకొని దూబే ప్లేస్‌లో హర్షిత్ రాణాను టీమ్‌లోకి తీసుకున్నారు. ఆ మ్యాచ్‌కు రిఫరీగా ఉన్న జవగళ్ శ్రీనాథ్ దీనికి అంగీకరించారు. ఆ మ్యాచ్‌లో హర్షిత్ మూడు వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. అయితే ఈ సిరీస్ ముగిసింది. 4-1 తేడాతో టీమిండియా విజయం సాధించింది. సిరీస్ ముగిసినా వివాదం మాత్రం ముదురుతూనే ఉంది.
ఆల్‌రౌండర్ అయిన దూబే ప్లేస్‌లో స్పెషలిస్ట్ పేసర్ అయిన హర్షిత్ రాణాను ఎలా సెలెక్ట్ చేస్తారనేది అసలు ప్రశ్న. ఐసీసీ రూల్స్ ప్రకారం బ్యాట్స్‌మెన్ గాయపడితే బ్యాట్స్‌మెన్‌ను తీసుకోవాలి.. బౌలర్ గాయపడితే బౌలర్‌ను తీసుకోవాలి. కానీ దూబే అప్పుడప్పుడు మాత్రమే బౌలింగ్ చేస్తాడు. అతని స్థానంలో పేసర్ హర్షిత్‌ను తీసుకోవడంపైనే ఇప్పుడు వివాదం. శ్రీనాథ్ తీరుపై మాజీ ప్లేయర్లు, క్రికెట్ నిపుణులు అభ్యంతరం వక్తం చేస్తున్నారు. ప్రముఖ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ అయితే శ్రీనాథ్ చేసింది ముమ్మాటికి తప్పే అంటున్నారు. అంతేకాదు టీమిండియా కోసం పక్షపాతం, అవినీతి కనిపిస్తోందంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. దూబేకి రాణా ఎలా రీప్లేస్‌మెంట్ అవుతాడని నిలదీశారు. అంతేకాదు ఇండియా మ్యాచ్‌కు మాజీ ఇండియన్ ప్లేయర్‌ను ఎలా రిఫరీగా నియమిస్తారు? తటస్థ రిఫరీలను ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. భారత మాజీ ప్లేయర్లు కూడా దీనిపై తీవ్రంగానే స్పందించారు. టీమిండియాలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని.. ఇలా కంకషన్ సబ్‌స్టిట్యూట్లతో గెలవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు సునీల్ గావస్కర్. అసలు ఈ మ్యాచ్‌లో కంకషన్ సబ్‌స్టిట్యూట్ అవసరమే లేదని.. ఒకవేళ అవసరమే అయినా దూబే బ్యాటింగ్ పూర్తి అయింది కాబట్టి ఆ ప్లేస్‌లో మరేవరినైనా తీసుకోవాల్సిందన్నాడు సన్నీ. ఓ రకంగా చెప్పాలంటే ఆయన కూడా జవగళ్ శ్రీనాథ్ నిర్ణయాన్ని తప్పు పట్టారు.
ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి జవగళ్ మెడకు చుట్టుకుట్టుంది. శ్రీనాథ్ చేసింది తప్పే అని.. అది అంగీకరించాల్సిందే అంటూ డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకైతే ఈ వివాదంపై శ్రీనాథ్ స్పందించలేదు. మరి ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి.