- కులగణనకు ఓకే అన్న కేంద్రం
- జనగణనతో పాటు కులగణన చేస్తామన్నప్రభుత్వం
- రెండూ ఒకేసారి చేయడం సులభం
- 2026 చివరిలో లేదా 2027 మొదట్లో కులగణన?
- బీహార్ ఎన్నికల నేపధ్యంలోనే కీలక నిర్ణయం
- హర్షం వ్యక్తం చేసిన బీహార్ బీజేపి శ్రేణులు
- జనగణనకు కనీసం ఏడాది సమయం
- ఆపై నియోజక వర్గాల పునర్విభజనకు ఛాన్స్
- ఇది కూడా కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం
- ఈలెక్కన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలా?
- జమిలి ఎన్నికలు ఖాయమేనా?
దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం దగ్గర పడుతోంది.అయితే ఈ సారి జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఇదొక చరిత్రాత్మక నిర్ణయం.. దీనికి ముహూర్తం ఎప్పుడన్నది కేంద్రం ప్రకటించకపోయినా 2026 చివరిలో లేదా 2027 మొదట్లో ఉండొచ్చన్న అంచనాలున్నాయి. 1931 తర్వాత ఇలాంటి కుల గణన జరగడం ఇదే తొలిసారి.
మేమే గెలిచాం… కాంగ్రెస్
మొన్నమొన్నటి వరకూ కుల గణనను తీవ్రంగా వ్యతిరేకించిన ఎన్డీఏ కూటమి ఇప్పడు హటాత్తుగా మనసు మార్చుకుని కులగణనకు సై అంటోంది. దేశ సామాజిక దృశ్యం అర్ధం కావాలంటే కులగణన చేపట్టాలని, అప్పుడే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందుకు అనుగుణంగా రూపొందించవచ్చని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎప్పటినుంచో అంటున్నారు. ఏదైతేనేం ఇదొక మంచి నిర్ణయం. స్వాగతించాల్సిన అంశం అంటోంది కాంగ్రెస్ పార్టీ.క్రెడిట్ అంతా రాహుల్ దేనంటూ ఆ పార్టీ ప్రకటించింది. జనాభా గణన అనేది కేంద్రం పరిధిలోనిది అయినా కొన్ని రాష్ట్రాలు కులగణన పేరుతో ఏవో సర్వేలు చేశారని అయితే వాటిలో పారదర్శకత లోపించిందని దాంతో సమాజంలో సందేహాలు రేగాయని కేంద్రం వ్యాఖ్యానిస్తోంది.
ఇప్పటి వరకూ బీహార్, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు మూడేళ్ల నుంచి కులగణన పేరుతో సర్వేలు నిర్వహించాయి. మరోవైపు కర్ణాటక రాష్ట్రం 2015లో కులగణన పేరుతో సేకరించిన సర్వే వివరాలు బయట పెట్టడానికి తర్జన భర్జనలు పడుతోంది. ఈసర్వేలు చేసిన సమయంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలే అధికారంలో ఉండటం విశేషం. అయితే విచిత్రమేమంటే ఈ రాష్ట్రాలు జరిపిన సర్వేలన్నీ ఒకే మాదిరిగా ఉన్నాయి.బీసీలే అతిపెద్ద సామాజిక వర్గం అని జనాభాలో వారు దాదాపు సగం మంది ఉన్నారని ఆ సర్వేలు తేల్చాయి.అగ్రవర్ణాలు, కులాల ప్రాతినిధ్యం జనాభాలో చాలా తక్కువని అయినా వారిదే ఆధిపత్యమనీ ఈసర్వేలు తేల్చాయి. దేశ వ్యాప్తంగా కుల గణన జరిపితే ఉద్యోగాలు, విద్యావకాశాలలో కులం ఆధారిత రిజర్వేషన్లు మరిన్ని పెరిగే అవకాశముంది. ఇది వెనుకబడిన కులాల రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న 1992 నాటి సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించడమే అవుతుంది.
రాజకీయాలకు సామాజిక స్థిరత్వం దెబ్బతినరాదని అందుకే జనగణనతో పాటు కులగణన ఒకే సారి జరిపితే పారదర్శకంగా ఉంటుందని బీజేపి ప్రస్తుతం వాదిస్తోంది. ఇది మన సమాజం సామాజిక, ఆర్థిక నిర్మాణాన్ని బలపరుస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.రాజకీయ పార్టీలు ఇప్పటి వరకూ చేసిన సర్వేలన్నీ స్వార్ధ ప్రయోజనాలకోసమేనన్నది బీజేపి వాదన.కొన్ని రాష్ట్రాలు తమ రాజకీయ కోణంలోంచే చేసిన ఈ కులగణన సర్వేలు పారదర్శకంగా లేవని, కులగణన సర్వే అన్నది పారదర్శకంగా జరపాల్సిన అవసరం ఉందని బీజేపి వాదిస్తోంది.
2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కులగణన చేస్తామని,దీనిపై చర్చకు కొంతమంది మంత్రుల బృందాన్ని కూడా అపాయింట్ చేస్తామని అన్నారు. అప్పట్లో దాదాపు అన్ని పార్టీలు దీనికి సరేనన్నాయి. అయితే కుల సర్వే చేయడం సమంజసమని దానికి secc అనే పేరు కూడా పెట్టారు. దీనిలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో అసలు డాటాను బయట పెట్టలేదు. దశాబ్దాల పాటు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కులగణనను వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాక కులగణన జరగాలంటూ పట్టుబడుతున్నాయన్న విమర్శలున్నాయి.
మిత్ర పక్షాల హర్షం..
ప్రభుత్వం ఈ ప్రకటన చేయగానే ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ స్వాగతించాయి. ప్రత్యేకించి బీహార్ ఎన్డీఏ కూటమి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది బీహార్ కు ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి కుల గణన అస్త్రాన్ని బీజేపి ప్రయోగించినట్లుగా కనిపిస్తోంది.
అసలు జనగణన ఎలా చేస్తారు?
జనగణన అనేది చాలా చాలా సుదీర్ఘమైన ప్రక్రియ.దేశ జనాభాను లెక్కించడం అంటే భౌగోళిక వివరాలతో పాటు, జనాభా వయసు, లింగ, ఉపాధి, ఇలా అన్ని వివరాలూ సేకరించాల్సి ఉంటుంది. పైగా గతంలో కంటే ఇప్పుడు జనాభా బాగా పెరిగారు. జన గణనకు 30 లక్షల మంది ప్రభుత్వాధికారులు రంగంలోకి దిగుతారు. వారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. పైగా జనగణను రెండు దశల్లో చేస్తారు. ముందుగా జనాభా ఉన్న ప్రాంతాలను గుర్తించి లెక్కించి వివరాలు నమోదు చేయడానికి షెడ్యూల్ నిర్ణయిస్తారు. ఆపై జనాభాను లెక్కించి వివరాలను డిజిటల్ గా నమోదు చేస్తారు. ఇది మొత్తం ప్రక్రియ జరగడానికి దాదాపు 11 నెలల సమయం పడుతుంది. జనాభా గణన ప్రతీ పదేళ్లకు ఒకసారి చేస్తారు. మనదేశంలో ఇప్పటి వరకూ 15 సార్లు జనగణన చేశారు. చివరి సారిగా 2011లో జనగణన చేశారు. 2021లో జనగణన చేయాల్సి ఉన్నా కోవిడ్ -19 కారణంగా అది వాయిదా పడింది. ఈసారి జనగణన డిజిటల్ గా మొబైల్ ఫోన్ అప్లికేషన్ ద్వారా చేస్తారు.16 భాషల్లో దీనిని చేస్తారు. ఇది ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. 2021లో జనగణన కోసం బడ్జెట్ లో 37 బిలియన్ల రూపాయలను కేటాయించారు.
2028 చివర్లో ఎన్నికలకు కేంద్రం?
జనాభా గణన తర్వాత నియోజక వర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. జనగణనకు ఎంతలేదన్నా ఏడాది సమయం పడుతుంది. దాని ఆధారంగా ఆ జాబితాను పరిశీలించి, బహిర్గత పరచి జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాలు పునర్విభజించాల్సి ఉంటుంది. ఇది అంత సులభమైన ప్రక్రియ కాదు. దీనికి ఎంత సమయం పడుతుందన్నది అంచనా వేయలేం. రాష్ట్రాల భౌగోళిక స్వరూపం, జనాభా విస్తరణ ప్రాతిపదికన రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయించి దాని ప్రకారం నియోజక వర్గాలను పునర్నిర్వచించాల్సి ఉంటుంది. దీన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని బీజేపి ఉబలాటపడుతోంది. గతంలో చేసిన జనగణన లేదా కులగణన పేరుతో ప్రతిపక్షాలు వివిధ రాష్ట్రాల్లో చేసిన సర్వేలన్నీ బూటకమని విమర్శిస్తున్న బీజేపి ఈసారి కులగణన ఎలా చేస్తుంది? అందులో ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారన్న వివరాలు వెల్లడవుతాయి. దానికి విపక్షాల ఆమోద ముద్ర పడిన తర్వాత ఎన్నికలకు మార్గం సుగమం అవుతుంది. కేంద్రం ఇప్పటికే జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోందన్నది అనధికారిక సమాచారం. మొన్నామధ్య కొన్ని కీలక రాజ్యాంగ సవరణలు కూడా చేసింది. దీనిని బట్టి ఈసారి జమిలి ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరిగినా ఈసారి జరిగేవి జమిలి ఎన్నికలేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.