– తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది?
– తోటి రాష్ట్రాలను చూసైనా నేర్చుకోలేరా?
– భాషా సామర్థ్యాలు, నైపుణ్యాలు అవసరం లేదా?
– పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునే పరిస్థితి ఉందా?
అతి అనర్థదాయకం అంటారు. అలాగే అతిప్రేమ ప్రాణం మీదకు తెస్తుందంటారు. ఇవి రెండూ తెలుగు భాషకు సంబంధించిన నానుడులే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అకస్మాత్తుగా తెలుగు భాషపై పుట్టుకొచ్చిన అతిప్రేమ, అతి మమకారం కూడా అలాగే ఉందంటున్నారు పెద్దలు. మన మాతృభాష తెలుగును కాపాడుకునే ప్రయత్నాన్ని ఎవరూ కాదనరు. కానీ, అతి ప్రేమతో, అతి ప్రచారంతో, అతి మమకారంతో భావితరాలకు నష్టం చేకూరుస్తున్నారన్న వాదనలు అంతటా వినిపిస్తున్నాయి. తెలుగును పరిరక్షించుకోవడమంటే నష్టమెలా అన్న సందేహం కలగొచ్చు. కానీ, నేటి అధునాతన సాంకేతిక యుగంలో, ప్రపంచమే కుగ్రామంగా మారిన పరిస్థితుల్లో కేవలం తెలుగుమీద మమకారంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి భాషలను నిర్లక్ష్యం చేయడమే ఇక్కడ అందరికీ ఆక్షేపనీయం అంటున్నారు విద్యారంగ నిపుణులు.
తెలుగుపై ఉన్నట్టుండి ప్రేమ :
ఏపీలో గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా ఆంగ్లభాషకు ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడ కేంద్రంగా నిర్వహించడం, ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులో విడుదల చేయాలని సంకల్పించడం, ఆ దిశగా అమలు కూడా మొదలు కావడం వంటి పరిణామాలు ఆహ్వానించదగినవే అయినా, ప్రస్తుత సమకాలీన సమాజంలో ఆంగ్లభాషను నిర్లక్ష్యం చేయడమంటే ఆత్మహత్యా సదృశమే అన్న అభిప్రాయాలు ఉన్నాయి.
అప్పుడు జాతీయ స్థాయిలో చర్చ :
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో పాఠశాల విద్యకు మిక్కిలి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రాథమిక స్థాయినుంచే ఆంగ్లభాషను ప్రవేశపెట్టి.. ప్రాథమిక స్థాయి విద్యార్థులే ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడగలిగే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ లెవెల్ స్కూళ్లలో చదివిన వాళ్లతో సమానంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఆంగ్లభాష ప్రావీణ్యంలో పోటీ పడ్డారు. ఈ పరిణామాలు దేశమంతటా చర్చనీయాంశంగా మారాయి. అన్నివర్గాల నుంచి ప్రశంసలు అందుకునేలా చేశాయి.
భాషను కాపాడుకునే పద్ధతి ఇదేనా?
కానీ, కొంత కాలంగా నెలకొన్న పరిస్థితులు.. రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్లభాష ప్రాధాన్యతను తగ్గిస్తోందన్న విమర్శలున్నాయి. ఫలితంగా ఇప్పుడు ఏపీలో ఇంగ్లీష్ వర్సెస్ తెలుగు అనే పరిస్థితి నెలకొంది. ఇది ఇలాగే కొనసాగితే భావి భారత పౌరులకు ఆంగ్ల భాషా పరిజ్ఞానం తగ్గిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు చూస్తే, మంత్రుల ప్రకటనలు పరిశీలిస్తే.. పలువురు ప్రముఖుల ప్రసంగాలు గమనిస్తే.. ఇప్పుడు ఏపీలో తెలుగే కావాలన్న వాదనలు ఎక్కువవుతున్నాయి. అంతేకాదు.. ప్రభుత్వ జీవోలు తెలుగులో ఇస్తున్నారు. మరి.. తెలుగు ఇంగ్లీష్ వద్దంటున్నారు.
ప్రభుత్వ జీవోలు తెలుగులో ఇస్తున్నారు. అయితే, ఆల్‌రెడీ నిర్ణయాలు తీసుకున్న తర్వాత విడుదల చేసే జీవోలు ఏ భాషలో ఇస్తే ఏంటి? అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. భాషను కాపాడుకునే పద్ధతి ఇదేనా? అని కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి :
అయితే, ఈ పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్‌మాత్రమే కాదు.. తెలంగాణలోనూ ఉందని గుర్తు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంగ్లీష్‌కు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో మనవాళ్లు అవసరమైనంత స్థాయిలో జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీని తట్టుకోలేకపోతున్నారని చెబుతున్నారు. ఏదో మొదటినుంచీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే చదివిన వాళ్లను పక్కనబెడితే తెలుగు మీడియంలో చదివినవాళ్లు.. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వాళ్ల ఆంగ్ల భాషా పరిజ్ఞానం తక్కువగా ఉన్న కారణంగా.. మిగతావాళ్లతో పోటీ పడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడు, కేరళ ఎందుకు ముందున్నాయ్?
ఈ పరిస్థితుల నేపథ్యంలో కేవలం తెలుగులో మాత్రమే ప్రావీణ్యం గడిస్తే సరిపోదని, జాతీయ స్థాయిలో రాణించాలన్నా, ప్రపంచంతో పోటీ పడాలన్నా… తెలుగుతో పాటు.. ఇంగ్లీష్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అని విద్యారంగ నిపుణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ మేరకు మన తోటి రాష్ట్రాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఎక్కడో ఉత్తరాది పక్కన బెట్టి, మన దక్షిణాదిలోనే పరిశీలిస్తే.. ఓవైపు తమిళనాడులో చూసినా, మరోవైపు కేరళలో చూసినా.. వాళ్ల సొంత భాషపై ఉండే మమకారానికి ఎవరూ సాటిరారు అనేది అందరికీ తెలిసిందే. కానీ, వాళ్లు తమ మాతృభాషను కాపాడుకుంటూనే.. ఆంగ్లంలో అత్యద్భుతమైన నాలెడ్జ్ సంపాదించుకుంటున్నారు. ఇంగ్లీష్‌లో బోధనకు గానీ, ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం సంపాదించుకునేందుకు గానీ అవసరమైనంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోని ఇంగ్లీష్‌మీడియం స్కూళ్లలో బోధనకు కేరళ టీచర్లను తీసుకొచ్చి వసతి కల్పించి మరీ ఆంగ్లభాషలో టీచింగ్ చేయించేవాళ్లు. ప్రత్యేకంగా బోర్డులపై ‘కేరళ ఇంగ్లీష్ టీచర్లచే విద్యాబోధన’అని కూడా రాయించేవాళ్లు. మరి.. వాళ్లతో పోలిస్తే మనం ఎందులో తీసిపోతున్నాం. లోపం ఎక్కడుందనేది విశ్లేషించుకుంటే.. పాలకులు, రాజకీయ నాయకులు, అధికారులవైపే వేళ్లు చూపిస్తున్నాయి.
చదువు సరే.. ఉద్యోగం, ఉపాధి మాటేమిటి?
తెలుగు మీడియంలో విద్యాబోధన, తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వడం వరకూ ఓకే గానీ, ఆంగ్లభాష రాకపోతే అవకాశాలు రావడం లేదు. చదువులు పూర్తయి ఉపాధి, ఉద్యోగాల దాకా వచ్చేసరికి కేవలం తెలుగులో మాత్రమే నైపుణ్యం ఉంటే సరిపోవడం లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే, ఉద్యోగ పోటీల్లో తిరస్కరణకు గురవుతున్నారు. మరి.. ఇదే పరిస్థితి కొనసాగితే.. నేటి విద్యార్థులు, యువత భవిష్యత్తు ఎలా? అన్న ఆందోళన కనిపిస్తోంది. తెలుగు, తెలుగు అంటూ తెలుగు వెంట మాత్రమే పరుగులు తీస్తూ ఎటూ కాకుండా పోతున్నామా? అన్న ఆవేదన విద్యావేత్తలను కుదురుగా ఉండనీయడం లేదు. పరోక్షంగా ఇది ఒకరకంగా కుట్రే అన్న వాదనలు ఎక్కువవుతున్నాయి. మన ముందు తరానికి అవకాశాలు లేకుండా చేయడం కుట్ర కాకపోతే మరేంటన్న విమర్శలు కూడా వస్తున్నాయి.
అధ్యయనంతో ప్రయోజనం :
అయితే, ప్రభుత్వాల పెద్దలుగానీ, ప్రముఖులు గానీ, మేధావులు గానీ తెలుగు భాష పరిరక్షణ కోసం బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదని, పక్కనే ఉన్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకుంటే సరిపోతుందని విద్యారంగ నిపుణులు సలహా ఇస్తున్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో తమ మాతృభాషను కనుమరుగు కాకుండా కాపాడుకుంటూనే ఆంగ్ల భాషకు ఇస్తున్న ప్రాధాన్యతపై అధ్యయనం చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో గత ప్రభుత్వం పాఠశాల విద్యలో అమలు చేసిన ఆంగ్లభాషా నైపుణ్య మెళకువలను కొనసాగిస్తూనే.. తెలుగు భాషను పరిరక్షించుకోవచ్చని సలహా ఇస్తున్నారు.