- టీడీపీ మద్దతుదారుల్లో అలజడి రేపిన హైందవ శంఖారావ సభ
- పవన్ ఆసరాతో తెలుగు రాష్ట్రాలపై కమలం గురి…
- చంద్రబాబు తర్వాత టీడీపీ సంగతేంటి…?
- టీడీపీ భవితవ్యంపై ఆపార్టీ అనుకూల మీడియా ఆందోళన
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా? ప్రత్యేకించి ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య కనిపిస్తున్న మార్పులు ఈ అనుమానాలకు బీజం వేస్తున్నాయి. కూటమి రాజకీయాల్లో సరికొత్త సమీకరణలకు నాంది పడుతోందా? 2029 ఎన్నికలు ఓ స్పష్టమైన మార్పుకు దారితీసే సంకేతాలు ఇప్పుడు కనిపిస్తుండటంతో అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. తెలుగు దేశం భవిష్యత్తు గురించి ఆ పార్టీ వెల్ విషర్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకులో నిన్న రాసిన కథనం పూర్తిగా చంద్రబాబుకు కర్తవ్య బోధ చేస్తున్నట్లుగానే సాగింది. దీనిని బట్టి వచ్చే ఎన్నికల నాటికి కూటమి కుదేలవుతుందా? ఎవరికి వారే యమునా తీరే అనేలా ఆయన కథనం సాగింది. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఆ అధినేత చంద్రబాబు మెతకగా ఉంటే సరిపోదని ఇప్పుడే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని హితబోధ చేశారు. అంటే అధికారాన్ని యధా శక్తి వినియోగించి ప్రత్యర్దిని నిర్వీర్యం చేయమనే సలహా అన్నమాట. పైగా తెలుగు దేశం పార్టీ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూనే వైసీపీ అధినేత జగన్ పై ఉన్న కేసులను వేగంగా కదిపి ఆయన్ను జైలు పాల్చేయడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారన్న అసహనాన్ని ప్రదర్శించారు. జగన్ ను కేసులలో ఇరికించి జైలుకు పంపి రాజకీయంగా ఎలిమినేట్ చేయాలన్న దుగ్ధ ఆ రాతల్లో కనిపిస్తోంది.
మరోవైపు టీడీపీ యువనేత, భవిష్యనాయకుడు అయిన లోకేష్ ఇప్పటి వరకూ స్వతంత్ర్యంగా ఒక సమర్ధ నేతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడని, తండ్రి చాటు బిడ్డగా ఉండటం వల్ల నాయకుడిగా ఎదగలేకపోతున్నాడని రాధాకృష్ణ తన కొత్తపలుకులో ఎత్తిచూపారు. చంద్రబాబు ఇలా మెతక వైఖరి అవలంభిస్తే 2029 నాటికి రాజకీయ యవనికపై జగన్, పవన్ మాత్రమే ప్రత్యర్ధులుగా నిలబడతారని రాధాకృష్ణ తన ఆర్టికల్‌లో కలవరం వ్యక్తపరిచారు. అందుకే జగన్‌ను కేసుల్లో ఇరికించి జైలు పాలు చేయమని సలహా ఇచ్చారు. 2029 నాటికి లోకేష్ ను ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేయడం లేదన్న బాధ ఆ పత్రికాధిపతిలో కనిపిస్తోంది. చంద్రబాబు వయసు అయిపోయి రిటైర్మెంట్ కు చేరుకున్నారని కానీ వారసుడికి తగిన సోపానాలు పరవలేకపోతున్నారని దెప్పి పొడిచారు. పాలనపై పెట్టిన శ్రద్ధ పార్టీ భవిష్యత్తుపై పెట్టడం లేదని బాధ పడ్డారు. జగన్ తనకంటూ సొంత ఓటు బ్యాంకును సాధించారని, పవన్ కల్యాణ్ కి కాపుల మద్దతు అపారంగా ఉందని అన్నారు. అంటే లోకేష్‌లో నాయకత్వ ప్రతిభ లేదని వారసుడిని గ్రూమ్ చేయడం సరిగా లేదన్నది ఆ కథనం సారాంశం.
టీడీపీ కలవరపెడుతున్న బీజేపి, పవన్‌ల వ్యూహాలు
రాధాకృష్ణ ఊహలకు తగ్గట్లు గానే బీజేపీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌న్ని ముందు పెట్టి తన పొలిటికల్ గేమ్ ప్రారంభించిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో ఉన్న సమీకరణలు బీజేపికి కొంతైనా ఎదగడనికి కలసి వచ్చాయి కానీ ఏపీలో రాజకీయాల తీరే వేరు. ఇక్కడ కుల సమీకరణలకే ఎక్కువ ప్రాధాన్యత. ఓటర్లు కూడా సామాజిక వర్గాల వారీగా చీలిపోయి ఉండటం ఏపీలో మాత్రమే కనిపించే ఓ స్పెషాలిటీ. బీజేపికి ఏపీలో ఇప్పటి వరకూ పట్టు దొరకక పోడానికి కారణం అక్కడ సరైన ఫేస్ వాల్యూ ఉన్న నేతలు లేకపోడమే. అక్కడ మతవిశ్వాసాలది పెద్ద పాత్రే అయినా అంత కన్నా ముందు కుల సమీకరణలకి పెద్ద పీట. రాజకీయ పరిణామాలు అలాగే మారుతుంటాయి. అందుకే బీజేపి మతం అస్త్రాన్ని సంధించలేకపోయింది. ప్రజలను ప్రభావితం చేసే చరిష్మా కలిగిన నేతలు ప్రస్తుతం కావాలి. కాబట్టి ఆనేతను వెతుకుతూనే హిందూ మత రాజకీయాల దిశగా ప్రజలను ప్రేరేపిస్తోంది. ఇందుకు అమరావతిలో నిన్న జరిగిన హైందవ శంఖారావ సభ కమలనాథుల ఆపరేషన్ సౌత్ కు గేట్ వే లాంటింది.
మత రాజకీయాలకు బీజం..
విజయవాడకు సమీపంలో కేసరపల్లి దగ్గర వీహెచ్‌పి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభ కిటకిటలాడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మన్ని నమ్మేవారు, బీజేపి, ఆరెస్ఎస్ భావజాలానికి దగ్గరగా ఉండేవారు లక్షలాదిమంది ఈ సభకు విచ్చేశారు. ఈసభ నిర్వహణలో వీహెచ్ పి ఉద్దేశం హిందూ ధర్మంపై ప్రజలకు విశ్వాసం కల్పించడం. నిద్రాణంగా ఉన్న మతం ఫీలింగ్ ను బయటకు తీయడం. ఈసభకు వెనక ఉండి ఏర్పాట్లు నిర్వహించినది ఆదోని బీజేపీ శాసనసభ్యుడు పార్ధసారధి. త్వరలో రాష్ట్ర బీజేపీ పగ్గాలు పార్థసారధికి అప్పచెపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆదివారం నాటి సభకు రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, శాసనసభ్యులు, మంత్రి, ఇతర ముఖ్యనాయకులు హాజరై వేదిక కిందే కూర్చుని అద్యంతం అక్కడే ఉన్నారు.
జనసేనాని చూపు ఎటువైపు?
ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ కదలికలపై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. పార్టీ పెట్టినప్పుడు చేగువేరా ఆదర్శమంటూ కొంత కమ్యూనిస్టు భావజాలం వెదజల్లిన పవన్ 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత హిందుత్వ ఎజెండా కిందకు పార్టీని తీసుకు వెళ్లారు. తీరా ఎన్నికలు అయిపోయి అనుకున్న స్ధాయి కంటే ఎక్కువ విజయం సొంతం చేసుకున్న తరువాత తనకు తాను అన్‌అపాలజటిక్ సనాతనీగా ఫోకస్ చేసుకుంటున్నారు. పైకి మరో పదేళ్ల పాటు చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడినంత మాత్రన ఆయనకు సీయం పీఠంపై ఆసక్తి లేదనుకోవడం అమయకత్వం. లోకేష్ ను సీయం రేసు నుంచి తప్పించడానికి ప్రస్తుతానికి ఆయన చంద్రబాబు నామజపం చేస్తున్నారనే వాదన కూడా ప్రచారంలో ఉంది. బీజేపీ ప్రమేయంతోనే ఆయన అన్‌అపాలజటిక్ సనాతనీగా మారాడని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో సంఘపరివారం అంతా కలసి రాష్ట్రంలో హిందూ భావజాలం ఉత్తుంగ తరంగంలా వ్యాపించేసి ఆ కిరీటాన్ని పవన్ తలపై అలంకరిస్తారనే అనుమానాలు టీడీపీ వర్గాల్లో మొలకెత్తాయి. ఈ తలంపుతోనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ భవిష్యత్ దర్శనం చేసి కొత్తపలుకులో టీడీపీ ఫ్యూచర్ పై ఆందోళన వ్యక్తం చేశారు.
ఎజెండా ఫిక్సయిపోయిందా?
ఏతావాతా ఈ పరిణామాలన్నీ చూస్తుంటే 2029 ఎన్నికల రణరంగం ఎజెండా ఫిక్స్ అయిపోయిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టడమే బీజేపి ధ్యేయం. ఇందుకు వారు వాడుతున్న ట్రంప్ కార్డ్ మత మార్పిడులు. జగన్ పరిపాలన సమయంలో మతమార్పిడులు ఎక్కువగా జరిగాయన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్‌లు నానా హంగామా చేశాయి. జగన్ ఎన్నడూ ఈ ఆరోపణను కొట్టి పారేయడం కానీ, వివరణ ఇవ్వడం కానీ చేయలేదు. ఆయనది లౌకికవాద, సెక్యులర్ అజెండా. కానీ బీజేపి ఈ సారి ఈ ఎజండాతో రాజకీయం మొదలెట్ట బోతోందన్నది సుస్పష్టం. పవన్ కల్యాణ్ పై బీజేపికి గురి ఉన్నా, ఆయన ఎంత వరకూ సహకరిస్తారన్నది సందేహం. బీజేపి బాధ్యతలు భుజాన వేసుకునే వ్యక్తి అయితే పార్టీని ఈ పాటికే విలీనం చేసి ఉండాలి. కానీ తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ఆయన అడుగు లేస్తున్నట్లుగా అర్ధమవుతోంది. కాబట్టి కమలం మార్క్ పాలిటిక్స్ కి నిన్నటి హైందవ శంఖారావ సభతో నాంది పడిందనే అనుకోవాలి. కాపు సామాజికవర్గం నుంచి ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇదే సరైన ఎజెండా అనే భావన ఆంధ్రా కాపుల్లో బలంగా నాటుకుంటోంది. ఈ దిశగా పవన్ కళ్యాణ్ కూడా తన సామాజికవర్గం కల తీర్చడానికి బీజేపీతో బేషరతుగా జతకట్టవలసిన పరిస్ధితి తలెత్తుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీ అడుగుజాడల్లో నడుస్తున్నాడనే వాదన కూడా లేకపోలేదు.