30.8 C
Hyderabad
Sunday, July 26, 2026

Live Video

spot_img

డాలర్ పతనం.. టారిఫ్‌ ల ప్రభావమేనా?

  • ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్‌ కుదేలు
  • పడిపోయిన అమెరికన్ డాలర్ విలువ
  • చైనా యువాన్ ల పతనం కూడా
  • మన రూపాయి కూడా 0.07 శాతం తగ్గుదల
  • పడిపోయిన బంగారం, చమురు, బిట్‌ కాయిన్ ధరలు
  • తమ ఇన్వెస్టర్లకు మేలు చేసేలా ట్రంప్ శాసనాలు
  • స్టాక్ మార్కెట్ తో గేమ్స్ ఆడుతున్నారన్న డెమోక్రట్లు
  • 75 దేశాలపై 90 రోజుల పాటు టారిఫ్ ల ఉపశమనం
  • వాటిపై ప్రస్తుతం అమలయ్యే పదిశాతం టారిఫ్ కొనసాగింపు
  • స్టాక్ మార్కెట్ల పతనం ట్రంప్ పుణ్యమే..

సంపన్న అమెరికాను సృష్టిస్తానంటూ ప్రపంచ దేశాలపై టారిఫ్ లు విధించిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. మన దేశంలో కూడా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలి నేల చూపులు చూశాయి. ఈ దెబ్బకు ఇన్ సైడర్ ట్రేడింగ్‌ జరిగే ప్రమాదముందని భావించిన ట్రంప్ చైనా తప్ప ఇతర దేశాలన్నింటిపైనా 90 రోజుల పాటు టారిఫ్‌ లు అమలు కాకుండా తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈ దేశాలన్నింటిపై పది శాతం టారిఫ్ లు మాత్రమే అమలవుతాయని ప్రకటించారు. టారిఫ్‌ లు అనౌన్స్ చేసిన 24 గంటల్లోనే ఆయన ఈ 90 రోజుల ఉపశమన మంత్రం పఠించారు.

తల్లకిందులైన ప్రపంచ స్టాక్ మార్కెట్

టారిఫ్ లు ప్రకటించిన 24 గంటల్లోనే.. అమెరికా స్టాక్ మార్కెట్లు ఆదేశ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. గురు, శుక్ర వారాల్లోనే 6.6 ట్రిలియన్ల అమెరికన్ డాలర్ల పతనాన్ని చవి చూశాయి. అంతకుముందు మంగళవారం కొంత కోలుకున్న అమెరికన్ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రంప్ దిగుమతులపై కొత్త టారిఫ్‌లు ప్రకటించేసరికి దభేల్న మళ్లీ పడిపోయాయి. చైనాపై అత్యధికంగా 104 శాతం టారిఫ్ లు ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా ట్రేడ్‌వార్ షురూ అయినట్లేనని నిపుణులు భావించారు.

10 ట్రిలియన్ డాలర్ల గ్లోబల్ ఈక్విటీ వాల్యూ నష్టం

బ్లూమ్ బర్గ్ నివేదికల ప్రకారం మూడు రోజుల పాటు అమెరికన్ మార్కెట్లు కోలుకోలేనంతగా పడిపోయాయి. గురు,శుక్ర, సోమవారాలు స్టాక్ మార్కెట్లు దారుణంగా పతనం కావడంతో పది ట్రిలియన్ల అమెరికన్ డాలర్ల గ్లోబల్ ఈక్విలీ వాల్యూ పడిపోయింది. ప్రపంచ దేశాల గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పదిశాతం నష్టపోగా, 150 దేశాల సంయుక్త జీడీపీ కూడా (కంబైన్డ్ జీడీపీ) కూడా దారుణంగా పడిపోయింది.అమెరికాలో ఉన్న టాప్ 500 కంపెనీల స్టాక్ మార్కెట్ ఇండెక్స్ 1950ల తర్వాత ఇంత దారుణంగా పతనం కావడం ఇదే మొదటి సారి. (అమెరికా ఎకానమీని, స్టాక్ మార్కెట్ ను అంచనా వేయడానికి ఈ 500 కంపెనీల పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లే కీలకం)

ప్రపంచ మాంద్యం భయం?

ఇక ఈ మధ్యకాలంలో మినిమం స్థాయి దాటి 20 శాతం కన్నా తక్కువకు పడిపోయిన సందర్భం కూడా ఇదే. కోవిడ్‌ 19 తర్వాత ఇంత దారుణమైన పతనం ఎన్నడూ లేదు. ట్రంప్ టారిఫ్‌ ల దెబ్బ ప్రపంచ మార్కెట్ ను మాంద్యంలోకి నెట్టేస్తుందన్న ఆందోళనలు వెంటాడాయి.

బంగారం, బిట్ కాయిన్, చమురు ధరలపైనా ప్రభావం?

స్టాక్ మార్కెట్ కు తోడు బంగారం ధరలు, క్రూడాయిల్ ధరలు, బిట్‌ కాయిన్ విలువ కూడా పతనమయ్యాయి. క్లిష్టసమయాల్లో ఆదుకునే ఒక విలువైన వస్తువుగా చూసే బంగారం ఈ మధ్య కాలంలో చాలా రేటు పెరిగిపోయింది. కానీ టారిఫ్ ల దెబ్బతో దాని ధర తగ్గింది. టారిఫ్‌ ల దెబ్బకు క్రూడాయిల్‌ ధరలు కూడా 7 శాతం తగ్గాయి. మంగళవారం నాటికి బ్యారెల్‌ 57 అమెరికన్ డాలర్లకు పడిపోయింది. 2021 తర్వాత ఇంత తక్కువకు పడిపోయిన సందర్భం ఇదే.

బిట్‌ కాయిన్…

ట్రంప్ వస్తే బిట్ కాయిన్ విలువ పెరుగుతుందనుకున్నారు అంతా. కానీ తాజాగా విధించిన టారిఫ్‌ ల వల్ల క్రిప్టో కరెన్సీ విలువ కూడా 30 శాతానికి పడిపోయింది.

గ్లోబల్‌ కరెన్సీలపై ప్రభావం…

ట్రంప్ టారిఫ్‌ ల ప్రభావం అమెరికా ట్రేడింగ్‌ భాగస్వాములపై కూడా పడింది. ప్రపంచ మార్కెట్ కరెన్సీలు మిశ్రమ ప్రభావాన్ని చూపాయి. యెన్,యూరో కరెన్సీల విలువతో పోలిస్తే డాలర్ విలువ తగ్గిపోగా, చైనా యువాన్ విలువ గత 19నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువకు పడిపోయింది. దాంతో ట్రేడ్ టారిఫ్‌ వార్ మొదలైనట్లేనన్న భయం వెంటాడింది. యూరోపియన్ కరెన్సీ 0.1 శాతం తగ్గగా, బ్రిటీష్‌ పౌండ్లు గత వారంలో ఒక శాతం తగ్గాయి. రష్యా రూబుల్ విలువ స్వల్పంగా పతనం కాగా చైనా యువాన్ విలువ 19 నెలల్లో ఎన్నడూ లేనంతగా దిగజారింది.

మన రూపాయి లాస్ ఎంత?

దక్షిణాసియా పవర్ హౌస్ గా చెప్పుకునే మన ఇండియన్ కరెన్సీ విలువ 0.7 శాతం తగ్గింది. ఇది గత మూడు నెలల్లో అత్యధిక పతనం. ప్రస్తుతం డాలర్ కు రూపాయి మారకం విలువ 86.44 గా ఉంది. ఇది నిన్నటికంటే కొంత తక్కువ.

పెరిగిన యెన్ విలువ…

ఈ మిశ్రమ ప్రభావానికి భయపడిన ఇన్వెస్టర్లు ఈ అనిశ్చిత స్థితికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించారు. దాంతో డాలర్ కు యెన్ విలువ 146.46 గా నమోదైంది.

ప్రపంచ మాంద్యం వస్తుందా?

ఏ దేశం జీడీపీ అయినా ఆరునెలల పాటు తగ్గిందంటే దానిని మాంద్యం కింద లెక్కిస్తారు. 1950ల తర్వాత అమెరికా 11 సార్లు మాంద్యానికి బలైంది. 1973-1975లో 1980-1982 లో కూడ్రాయిల్‌ సంక్షోభం తలెత్తినప్పుడు, 2001లో డాట్‌ కామ్‌ బూమ్ వచ్చినప్పుడు,2007-2009లలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక సంక్షోభం తలెత్తినప్పుడు,2020లో కోవిడ్‌ 19 వచ్చినప్పుడు అమెరికా ఆర్ధిక మాంద్యానికి బలైంది.

ఎంత మాంద్యం నెలకొనచ్చు?

ప్రస్తుత సమయంలో టారిఫ్ ల వల్ల ఆర్ధిక మాంద్యం 60 శాతం ఉండొచ్చని జేపీ మోర్గాన్ లాంటి విశ్లేషకులు చెబుతుండగా, గోల్డ్ మాన్, మార్నింగ్ స్టార్ లాంటి సంస్థలు ఈ మాంద్యం దెబ్బ 40నుంచి 50 శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి.

టారిఫ్‌ లపై నిలుపుదల ఎందుకంటే…

ప్రపంచ దేశాలపై తాను విధించిన టారిఫ్‌ లను ట్రంప్ మూడు నెలల పాటు నిలుపుదల చేశారు. దాదాపు 75 దేశాలతో దిగుమతులపై లెవీని తగ్గించే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. తన టారిఫ్ లకు స్పందించి పరస్పర టారిఫ్‌ లు అమలు చేయని దేశాలకు 10 శాతం టారిఫ్ లు మాత్రమే అదీ జూలై వరకూ మాత్రమే అమలవుతాయని స్పష్టం చేశారు. ఈ తాత్కాలిక ఉపశమనం వ్యూహాత్మకమేనని వివిధ దేశాలు తమతో కలసి పనిచేసేందుకు అంగీకరిస్తేనే అని సంకేతాలు పంపారు.అంటే తమ దారికి రాని దేశాలపై టారిఫ్ ల దాడి మరింతగా ఉంటుందని చెప్పకనే చెప్పారు.

ఆ ఒక్క దేశం తప్ప…

అయితే ఈ టారిఫ్ ల ఉపశమనం చైనాకు మాత్రం కుదరదని ట్రంప్ అన్నారు. చైనాకు గతంలో అమలవుతున్న 20 శాతం టారిఫ్ లకు అదనంగా ఈనెల 2న 34 శాతం టారిఫ్ విధించారు.దీనికి ప్రతిగా చైనా కూడా టారిఫ్ లు ప్రకటించింది. అమెరికా వస్తువులపై 84 శాతం టారిఫ్ లు ప్రస్తుతం చైనా అమలు చేస్తోంది. చైనా వస్తువులపై ట్రంప్ 125 శాతం లెవీ విధిస్తూన్నట్లు ప్రకటించారు.

అమ్మకాల వత్తిళ్లు…

ప్రపంచ మార్కెట్ ను, జీడీపీని శాసిస్తున్న ఈ రెండు దేశాలు పోటా పోటీ టారిఫ్ లు విధించడంతో మూడు ప్రధాన స్టాక్ సూచీలు డౌ జోన్స్, ఎస్ అండ్ పీ 500, నాస్ డాక్ లు 5 శాతం పడిపోయాయి. 2020 తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్ ఇంత తక్కువకు పడిపోవడం ఇదే మొదటిసారి.కోవిడ్‌ -19 పాండమిక్ సమయంలోనూ ఇలాంటి సంక్షోభమే వచ్చింది.ఫలితంగా యూఎస్ ట్రజరీ బాండ్ మార్కెట్ అమ్మకాల వత్తిళ్లను ఎదుర్కొంది.

ట్రంప్ ఎఫెక్ట్…

అయితే ట్రేడ్ టారిఫ్ లపై తాత్కాలిక ఉపశమనం ప్రకటించడానికి ముందు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ లో తమ ఇన్వెస్టర్లను కొనుగోళ్లు చేయాల్సిందిగా సూచించారు.ట్రంప్ ఇలా ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే స్టాక్ మార్కెట్‌ ప్రధాన సూచీ అయిన ఎస్ అండ్ పీ 500 9.5 శాతం పెరిగింది. నాస్ డాక్ కూడా 12.2శాతం పెరిగింది. డౌ జోన్స్ మూడువేల పాయింట్లు పెరిగింది.ట్రంప్ ను నమ్మి స్టాక్ పెట్టుబడులు పెట్టిన వారంతా పెద్ద ఎత్తున లాభాలు పొందారు. అలాగే టారిఫ్ ల ఉపశమనానికి ముందు మార్కెట్లు పతనం సూచిస్తున్న టైమ్ లో అమ్మకాలు జరిపిన ఇన్వెస్టర్లు నష్టం చవిచూశారు.

విధానాలపై దర్యాప్తు?

ట్రంప్ తీరును డెమోక్రట్లు తప్పుబడుతున్నారు. ఆయన ఉద్దేశపూర్వకంగా టారిఫ్ ల విధింపు, ఎత్తేయడం చేయడం ద్వారా మార్కెట్ల సంక్షోభానికి కారణమవుతున్నారని, దీనిపై విచారణ జరపాల్సిందేనని విమర్శిస్తున్నారు. లాభాలకోసం మార్కెట్ల స్వేచ్ఛాయుత లావాదేవీలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అయితే ట్రంప్ ఎలాంటి మానిప్యులేషన్ చేయడం లేదని, తమ దేశపు పారిశ్రామిక సంక్షోభానికి కారణమవుతున్న గ్లోబల్ ట్రేడింగ్‌ వ్యవస్థను చక్కదిద్దుతున్నారని ట్రంప్ సమర్ధకులు చెబుతున్న మాట.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com