27.7 C
Hyderabad
Monday, May 25, 2026

Live Video

spot_img

ఆ ప్రెస్ మీట్ మర్మం అదేనా?

  • ఆపరేషన్ సింధూర్ కు నేతృత్వం వహించిన మహిళలు
  • కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్
  • ఇద్దరూ అకుంఠిత దీక్షతో యాక్షన్ ప్లాన్
  • ఏరికోరి రక్షణ దళాల్లోకి ఆ ఇద్దరి ఎంట్రీ
  • తొలిసారి కీలక ఆపరేషన్ లో మహిళలు
  • స్ట్రాటజిక్ ఆపరేషన్స్ లో దిట్టలు
  • తమ బలగాలను ముందుకురికించడంలో సాహసం
  • పెహల్గాం వితంతువుల కన్నీరు తుడిచిన మహిళలు
  • విజయవంతంగా ఆపరేషన్ పూర్తి
  • మోడీ ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నదిదేనా?
  • నుదుటి తిలకం చెరిపిన ముష్కరులకు మహిళలతోనే జవాబు
  • దేశ రక్షణలో జెండర్ తేడాలుండవని నిరూపించిన వైనం

ఆపరేషన్ సిందూర్ మెరుపు దాడుల్ని 25 నిముషాల్లోనే త్రివిధ బలగాలు విజయవంతంగా ముగించిన తర్వాత వాటిని అధికారికంగా మీడియాకి బ్రీఫ్ చేయడానికి కేంద్రం వ్యూహాత్మకంగా నడుచుకుంది. మెరుపు దాడుల్ని ఎంత పక్కాగా నిర్వహించిందో, ఆ ఆపరేషన్ డిటైల్స్ వెల్లడించడంలో కూడా అంతే పక్కాగా వ్యవహరించింది. ఈ ఆపరేషన్ వివరాలను మీడియాకు వివరించిన వారిలో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఉన్నారు. ఎందుకు వీరు ముగ్గురే బ్రీఫింగ్ ఇచ్చారు ? అన్న దానిపై రకరకాల చర్చలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. వీరినే ఎందుకు ముందుంచి ఈ మీడియా బ్రీఫింగ్ ఇచ్చారన్నది కూడా ఆసక్తికరం. విదేశాంగ శాఖ కార్యదర్శి కాబట్టి విక్రమ్ మిస్రీ ముందుకు వచ్చి మాట్లాడారు. కానీ ఆయన ఒక కశ్మీర్ పండిట్. మిగిలిన ఇద్దరు మహిళలు సైన్యంలో కీ రోల్ పోషిస్తున్నారు. పెహల్గాం ఉగ్రవాదులు దాడి జరిపినప్పుడు మతం అడిగి మరీ కాల్చి చంపడం,విదేశాంగ కార్యదర్శి కశ్మీర్ కు చెందిన పండిట్ కావడంతో  ఆయనకే ఈ బ్రీఫింగ్ అవకాశం దక్కింది. ఉగ్రవాదులు మహిళలు, పిల్లల్ని వదిలేసి వాళ్ల ఎదురుగా మగవాళ్లనే కాల్చి చంపేయడంతో ఇప్పుడు అదే మహిళల ఆధ్వర్యంలో భారీ ఆపరేషన్ ను చేపట్టాం అన్న విషయాన్ని ప్రపంచానికి చూపించాలన్న ఉద్దేశంతో వారితో మీడియా బ్రీఫింగ్ చేయించారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

అనుక్షణం ఆర్మీలోనే…

కల్నల్ సోఫియాది గుజరాత్ లోని వడోదర. ఆమె కుటుంబమంతా ఆర్మీయే..తాత ముత్తాతలందరూ ఆర్మీలో ఉన్నారు. సోఫియా తాత, తండ్రి కూడా ఆర్మీలో పని చేశారు. 1971లో ఇండియా, పాకిస్థాన్ యుద్ధంలో సోఫియా తండ్రి కూడా పాల్గొన్నారు. సోఫియా ముత్తాత 1857లో జరిగిన స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని బ్రిటీష్ ఆర్మీకి చుక్కలు చూపించారని సోఫియా బ్రదర్ సంజయ్ ఖురేషి చెప్పారు. ఇప్పుడు మూడో తరంగా సోఫియా కూడా సైన్యంలో కీలక రోల్ ప్లే చేస్తున్నారు. ఆమె బయో కెమిస్ట్రీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1990లో భారత ఆర్మీలో చేరారు. మూడు దశాబ్దాల ప్రయాణంలో ఆమె అత్యుత్తమ ధైర్య సాహసాలు ప్రదర్శించారు. విధి నిర్వహణలో ఎక్కడా రాజీపడలేదు. ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ మిషన్ లో భాగంగా 2006లో ఆమె కాంగోలో పని చేశారు. 2016లో పుణెలో ఆసియాకు చెందిన 18 దేశాలు పాల్గొన్న  ఎక్సర్ సైజ్ 18 ఆర్మీ కవాతుకి భారత్ కి నాయకత్వం వహించి తన లోని లీడర్ షిప్ క్వాలిటీస్ ని ప్రపంచానికి పరిచయం చేశారు. అప్పుడు పాల్గొన్న 18 దేశాల్లో కేవలం భారత్ బృందాన్ని మాత్రమే ఒక మహిళ ముందుండి నడిపించారు. శాంతి పరిరక్షణ కోసమే ఆమె ఎక్కువగా కృషి చేశారు. సరిహద్దుల్లో మందుపాతరల్ని తొలగించడం వంటి పనులన్నీ ఆమె ఆధ్వర్యంలో నడిచేవి.

రెస్క్యూ ఆపరేషన్స్ లో దిట్ట

ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పేరుకు తగ్గట్టుగా చిన్నప్పట్నుంచే పైలెట్ కావాలని కలలు గన్నారు. వ్యోమిక అంటే అంతరిక్షంలో నివసించే వాళ్లు అని అర్థం. అంతరిక్షానికి వెళ్లే వారిని అందుకే మనం వ్యోమగాములు అని పిలుస్తాం. వ్యోమిక కూడా అంతే చిన్నప్పట్నుంచి ఆకాశంలో విహరించాలన్నదే ఆమె ఆకాంక్ష. దానికి తగ్గట్టుగానే భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలెట్ గా చేరారు. స్కూలు రోజుల్లోనే ఎన్ సీసీలో చేరిన వ్యోమిక ఆ తర్వాత ఇంజనీరింగ్ లో డిగ్రీ తీసుకున్నారు. కానీ పైలెట్ కావాలన్న కోరికతోనే ఆమె భారత వైమానిక దళంలో చేరారు. వ్యోమిక కుటుంబంలో భద్రతా బలగాల్లోకి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఆమే. వ్యోమిక తన కెరీర్ లో ఇప్పటివరకు 2,500 గంటల సేపు హెలికాప్టర్ నడిపి రికార్డు సృష్టించారు. జమ్ము కశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లో అత్యంత ఎత్తైన ప్రాంతాల్లోనూ, వాతావరణం ప్రతికూలంగా ఉన్న సమయాల్లో కూడా చేతక్, చీతా వంటి హెలికాఫ్టర్లను నడిపారు. ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లలో కూడా పాల్గొన్నారు. 2019లో‌ ఫ్లయింగ్ బ్రాంచ్ లో ఆమె శాశ్వత హోదా పొందారు. 2020లో అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన ఒక రెస్క్యూ ఆపరేషన్ లో వ్యోమిక అందించిన సేవలకు ఎయిర్ ఫోర్స్ లో బాగా గుర్తింపు లభించింది. 2021లో త్రివిధ బలగాల్లో ఉన్న మహిళలందరూ కలిసి సముద్ర మట్టానికి 21,650 అడుగుల ఎత్తున ఉన్న మౌంట్ మణిరంగ్ ను అధిరోహించిన బృందంలో వ్యోమిక‌ కూడా ఉన్నారు. ఇలాంటి మిషన్స్ లో పాల్గొని శారీరకంగా కూడా పురుషులకి తాము ఏం తీసిపోమని మహిళలంతా చాటారు.

ఈ ఇద్దరు మహిళలు భారతీయ సైన్యంలో చాలా కీ రోల్ పోషిస్తున్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దయా దాక్షిణ్యాలు లేకుండా మహిళల నుదుట కుంకుమని చెరిపేస్తే అదే మహిళల్ని తాము మిలటరీలో ఎంత ప్రోత్సహిస్తున్నామో, పురుషులతో సమానంగా మహిళలు కూడా అత్యంత సంక్లిష్టమైన ఈ విధులు ఎలా నిర్వహించగలరో కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంది. ఆపరేషన్ సిందూర్ కి  కల్నల్ సోఫియా సింగ్ నేతృత్వం వహించారని కూడా వార్తలు వస్తున్నాయి. ఒక కశ్మీర్ పండిట్ తో పాటు ఇద్దరు మహిళా కమాండర్లు ఈ ఆపరేషన్ గురించి వివరించడం వల్ల అందరూ కలసికట్టుగా ఉగ్రవాద దాడులకు ప్రతీకారం తీర్చుకున్నట్టుగా పాకిస్థాన్ తో పాటు ప్రపంచానికి‌ మోదీ ప్రభుత్వం ఒక సందేశం ఇచ్చినట్టైంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com