- జీవీఎల్ కి కాకపోతే అన్నామలైకే
- మొన్న ఎమ్మెల్సీగా సోము వీర్రాజు
- నేడు రాజ్యసభకు జీవీఎల్ నరసింహారావు
- టీడీపీ శ్రేణులకు దెబ్బ మీద దెబ్బ
మాజీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వేణుంబాకం విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్ధానం నుంచి ఇప్పుడు ఎవరు ఎన్నికవుతారనే అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత జనవరి మాసంలో విజయసాయిరెడ్డి వైఎస్‌ఆర్‌సీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు, ఇకపై వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే ఇదంతా బీజేపీ గేమ్ ప్లాన్ అని తాను రాజీనామా చేసిన స్ధానం నుంచి మళ్ళీ భారతీయ జనతా పార్టీ తరపున విజయసాయిరెడ్డే ఎన్నికవుతారని విస్తృత స్ధాయిలో ప్రచారం జరిగింది. విజయసాయిరెడ్డి తిరిగి బీజేపీ తరపున రాజ్యసభకు ఎన్నికవడానికి టీడీపీ, జనసేన పార్టీల సహకారించాల్సిన పరిస్ధితి ఎదురవుతుందని ఆ రెండు పార్టీల సోషల్ మీడియా బృందాలు అప్పట్లో తెగ బాధపడిపోయాయి. దానికి తోడు విజయసాయిరెడ్డి పోకడలు కూడా ఆయన బీజేపీలో చేరుతున్నట్లుగానే ఉండేవి. దీంతో తమకు సాయిరెడ్డిని బలవంతంగానైనా మోయడం తప్పదేమో అని టీడీపీ, జనసేన శ్రేణులు నిరుత్సాహ పడిపోయేవారు.
అయితే బీజేపీవి ఎవరూ ఊహించని ఎత్తుగడలు ఉంటాయి. టీడీపీ శ్రేణులు బీజేపీలో ఎవరినైతే తమకు బద్ద శత్రువులుగా ఫీల్ అవుతారో ఇప్పుడు వారినే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్ధానానికి బీజేపీ ఎంపిక చేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. మాజీ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ అధికారప్రతినిధి జీవీఎల్ నరసింహారావును ఏపీలో ఖాళీ అయిన స్ధానం నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిర్ణయం ప్రస్తుత బీజేపీ నాయకత్వానికి, టీడీపీ, జనసేనలకు కూడా శరాఘాతం లాంటిదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రధాని నరేంద్రమోడీకి జీవీఎల్ సన్నిహితుడు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయనతో జీవీఎల్ సత్సంబంధాలు కొనసాగించారు. దానికి తోడు భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీ ఎందుకు కాకూడదని జాతీయ వేదికలపై మొదటి సారిగా మోడీ పేరు ప్రధాని రేసులో ప్రస్తావించిన వ్యక్తి జీవీఎల్. అందుకు కృతజ్ఞతగానే 2014 – 2019ల మధ్య జీవీఎల్‌ని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించారు ప్రధాని మోడీ. ఈ సారి కూడా విజయసాయిరెడ్డి రాజీనామా ద్వారా ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్ధానం నుంచి జీవీఎల్ నరసింహారావును ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ అనుకోని పరిస్ధితులు ఏమైనా ఎదురైతే జీవీఎల్ స్ధానంలో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కుప్పుస్వామి అన్నామలైకి అవకాశం దక్కవచ్చని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెపుతున్నాయి. ఇటీవలే అన్నామలైని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా తప్పించి ఆయన స్ధానంలో నైనార్ నాగేంద్రియన్ ని నియమించింది పార్టీ అధిష్టానం. ఇంతకాలం తమిళనాడులో పార్టీ ఉన్నతికి పాటుపడ్డ అన్నామలైకి రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం ఉంది. అయితే ఆయన్ను ఉత్తరాది రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు చెపుతున్నారు. ఏపీ నుంచి నూటికి తొంబైతొమ్మది శాతం జీవీఎల్ కే అవకాశాలు ఉన్నప్పటికీ ఒకవేళ ఆయన అభ్యర్ధి్త్వాన్ని బీజేపీ అధిష్టానం కాదనుకుంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నామలై పేరును పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో పాత తరం బీజేపీ నాయకుల్లో కొందరంటే టీడీపీ క్యాడర్ కి మండిపోతుంది. అందులో ముఖ్యలు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు. వీరిద్దరినీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలురుగా ముద్ర వేయాలని మొదటి నుంచి టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ మా పార్టీ అధిష్టానం వైఖరిని బట్టి మా వైఖరి ఉంటుందని మాకు రాష్ట్రంలో ఎవరు మిత్రులైనా ఎవరు రాజకీయ పరంగా శత్రువులైనా అది బీజేపీ కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుందని సోమ వీర్రాజు, జీవీఎల్ నరసింహారావులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు మాత్రం వారిద్దరి మీద విపరీతమైన ద్వేషం పెంచుకున్నారు. దాన్ని వారు ఎక్కడా దాచుకోరు కూడా. మొన్న సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు కూడా తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు, లోకేష్ లను సోషల్ మీడియాలో ప్రశ్నించారు. మళ్ళీ ఇప్పుడు జీవీఎల్ నరసింహారావుకి మద్దతు ఇచ్చి రాజ్యసభకు పంపాలంటే టీడీపీ కార్యకర్తలు ఎలా జీర్ణించుకుంటారో చూడాలి.
Very good https://is.gd/tpjNyL