ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా చంద్రబాబు నాయుడు సొంత సొమ్మా? అని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు కేవలం కస్టోడియన్ మాత్రమే అని గుర్తు చేశారు వైఎస్ జగన్.
చిత్తూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను అందరు న్యాయమూర్తులు, గవర్నర్ వినాలని జగన్ విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఏ పనులు చెయ్యవద్దని, ఏ పధకాలు ఆ పార్టీ వాళ్లకు ఇవ్వద్దని చంద్రబాబు బహిరంగంగా చెప్పాడన్నారు. ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి ఇది బాబు సొమ్మా…? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజల సొమ్ముతో నడుస్తోందని, పథకాలు ఇవ్వకపోవడానికి ఆయనెవరని ప్రశ్నించారు.
పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానంటూ ప్రమాణం చేసి ఇప్పుడు బాహాటంగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రిగా కొనసాగించడం ధర్మమేనా? ఇలాంటి వ్యక్తులు పరిపాలన చెయ్యడం ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా? అని వైఎస్ జగన్ తన ప్రెస్ మీట్లో నిలదీశారు.