ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాలను మోసం చేస్తోన్న కూటమి ప్రభుత్వం.. చివరకు అ్నదాతలను కూడా వదలడం లేదని, రైతులను కూడా తీవ్రంగా మోసం చేసిందని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం కిసాన్ పథకానికి సంబంధం లేకుండా సంవత్సరానికి రూ.20వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పటి వరకు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.
పీఎం కిసాన్ కింద కేంద్రం ఇస్తున్న రూ.10 వేలు కాకుండా.. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు వైఎస్ జగన్. రాష్ట్రంలో 53 లక్షల 58 వేల 266 మంది రైతులు ఉన్నారని, వీళ్లంతా తమ హయాంలో రైతు భరోసా డబ్బులు అందుకున్నారని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకుచంద్రబాబు రూ.10,717 కోట్లు కేటాయించాల్సి ఉందని, కానీ, గత బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించారని, ఇప్పుడు రెండో బడ్జెట్‌లో రూ.6,300 కోట్లు మాత్రమే కేటాయించారని ఎద్దేవా చేశారు. ఎలాగూ ఇచ్చేది లేదు.. చచ్చేది లేదు కాబట్టి ఎంత కేటాయించినా వ్యర్థమేనన్నారు. ఇలా చూసుకుంటే.. రాష్ట్రంలోని ప్రతి రైతుకు చంద్రబాబు రూ.20వేలు బాకీ పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రెండో ఏడాది కూడ కలుపుకుంటే రూ.40వేలు ఎగనామం పెట్టాడన్నారు. రైతులను మోసం చేయడం చంద్రబాబుకు కొత్త కాదన్నారు వైఎస్ జగన్. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని హామీ ఇచ్చి.. రైతులను మోసం చేసే కార్యక్రమం జరుగుతోందన్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో.. విత్తనం నుంచి పంట అమ్ముకునే వరకు ప్రతి రైతును చేయి పట్టుకుని నడిపించామన్నారు. ఇప్పుడేమో అంతా గుండు సున్నా అని మండిపడ్డారు. ఉచిత పంటల భీమా ధ్వంసమైందన్నారు. ఆర్‌బీకే వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. దళారులు లేకుండా పంటలు కొనుగోలు చేసే వ్యవస్థ ధ్వంసం చేశారన్నారు. నాణ్యమైన ఎరువులు, గ్రామంలో ఉండే కార్యక్రమం ధ్వంసమైందన్నారు. పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా సహకార రంగంలో అమూల్ లాంటి పెద్ద వ్యవస్థను తెస్తే దాన్ని ధ్వంసం చేశారన్నారు. పాల ధరలు ఏడు సార్లు పెరిగాయన్నారు. హెరిటేజ్ లాభాల కోసం పాల రైతుల బతుకులు చిన్నాభిన్నం చేస్తున్నారని ఆరోపించారు. మిర్చి రైతుల విషయంలో గారడీలు, మోసాలు కన్పిస్తున్నాయన్నారు. 40 రోజుల నుంచి మిర్చి రైతుల అవస్థలు చూస్తున్నామని, ఒక్క రైతు నుంచి ఒక్కకేజీ కూడా చంద్రబాబు కొనుగోలు చేయలేదన్నారు. మిర్చి విషయంలో అసెంబ్లీలో చంద్రబాబు ఒకమాట, వ్యవసాయమంత్రి మరోమాట చెబుతున్నారని విమర్శించారు. ధరల స్థిరీకరణ కోసం వైసీపీ హయాంలో రూ.3వేల కోట్లు కేటాయించామని, ఇతర పంటల కోసం రూ.7వేల కోట్లు ఖర్చు చేశామని, సీఎం యాప్ ద్వారా కొనుగోళ్లు జరిగేవని జగన్ గుర్తు చేశారు. చినీ, అరటి, పొగాకు పంటలు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామన్నారు. ధాన్యం కొనుగోలు కోసం రూ.65 వేల కోట్లు ఖర్చుచేయడం రికార్డ్ అన్నారు.
ఇప్పుడు మాత్రం ఏం పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. ధాన్యం, మిర్చి, టమాటా, పత్తి, మినుములు, కందులు, పెసలు అన్ని పంటల పరిస్థితి అదేనన్నారు. రైతు అవస్థల్లో ఉన్నారని, ఆదుకోవడంలో చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో కుల వృత్తులను ప్రొత్సహిస్తూ.. జగనన్న చెదోడు, వైఎస్‌ఆర్ లా నేస్తం, వౌఎస్‌ఆర్ నేతన్న నేస్తం పథకాలన్నీ రద్దు చేశారని, మత్స్యకార భరోసా కూడా చంద్రబాబు ఎగగొట్టారని వైఎస్ జగన్ ఆరోపణలు చేశారు.