ముంబై ఇండియన్స్.. మొదట ఓడటం.. ఆ తర్వాత వరుసగా గెలుస్తూ ఐపీఎల్ ట్రోఫీని ఎగరేసుకుపోవడం గతంలో జరిగిన అనుభవమే. ఎందుకంటే సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇలాంటి సీనే జరిగింది. అప్పుడు కూడా ముంబై ఇండియన్స్ ఇప్పుడు ఎదుర్కోన్న పరిస్థితులనే ఎదుర్కొంది.
ఒక్కసారి ప్రస్తుత సినారియో చూస్తే.. ముంబై ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడింది. తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఒకటే గెలుపు. కానీ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచేసింది. ఓవరాల్‌గా చూస్తే మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది MI. మొన్నటి వరకు లాస్ట్‌లో ఉన్న ఈ టీమ్ ఇప్పుడు ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. లీగ్ దశలో ముంబై ఇంకా ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే చాలు ముంబైని ప్లే ఆఫ్ రేస్‌లోంచి ఎవరూ తప్పించలేరు.
2020 ఐపీఎల్‌లోకూడా ముంబై తొలి మూడు మ్యాచ్‌ల్లో ఒకటే విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌కు వెళ్లడమే కాదు.. ఏకంగా కప్పును ఎగరేసుకుపోయింది. సేమ్ ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా? అనే క్వశ్చన్ తెరపైకి వస్తుంది. ముంబై మొదట ఓడినా.. ఇప్పుడు వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ వస్తోంది.
పూర్తిగా మారిపోయిన రోహిత్..
రోహిత్ శర్మ లాస్ట్ రెండు మ్యాచ్‌ల్లో అద్భుతమే చేశాడని చెప్పాలి. ఒక మ్యాచ్‌లో 76 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. SRHపై 70 పరుగులు చేశాడు. అంతకుముందు 6 మ్యాచ్‌ల్లో రోహిత్ చేసిన మొత్తం స్కోర్ 82 మాత్రమే. క్రీజులోకి రాగానే వరుసగా హిట్టింగ్ చేస్తూ ముంబై స్కోర్ బోర్డుని పరుగులు పెట్టిస్తున్నాడు రోహిత్. ఇదే ఫామ్ కొనసాగితే రోహిత్‌ను ఆపేవారే లేరని చెప్పాలి.