తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక ఘట్టంలోకి ప్రవేశించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) తన ప్రభావాన్ని నెమ్మదిగా పెంచుకుంటూ, ఇప్పటి నుంచే పార్టీ పరిపాలనను తన చేతుల్లోకి తీసుకుంటున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ముందుగా, రాజేంద్రనగర్ ఉప ఎన్నికలలో పటోళ్ల కార్తీక్ రెడ్డి పేరును ముందుగానే ప్రకటించడం, పార్టీ అధినేత కేసీఆర్ నుండి ఎటువంటి సూచనలు లేకుండానే అభ్యర్థి ఎంపిక చేయడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ స్టీరింగ్ కేటీఆర్ చేతుల్లోకి మారిందని నేతలు చెబుతున్నారు.
పార్టీ లోపలే కాదు, రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ఇదే గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, కేటీఆర్ సీఎం అభ్యర్థిగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక కేసీఆర్ మాత్రం రాజకీయంగా పూర్తిగా సైడ్ లైన్ కావచ్చని ఊహాగానాలు బలపడుతున్నాయి. కేసీఆర్ గతంలో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ సమయం ఫామ్‌హౌస్‌లోనే గడుపుతూ, వ్యవసాయంపై దృష్టి సారిస్తున్నారు. ఆయనకు ఇకపై పెద్దగా పాలిటికల్ లక్ష్యాలు లేవన్న అభిప్రాయమే పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఆయన పార్టీ వ్యవస్థాపకుడిగా, గౌరవ అధ్యక్షుడిగా మారిపోతున్నారని చర్చ జరుగుతోంది.
ఇదే సమయంలో కేటీఆర్ వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్టు ప్రకటించారు. ఇది కేవలం ప్రజలతో అనుసంధానం మాత్రమే కాకుండా, పార్టీ పునర్నిర్మాణానికి, అభ్యర్థుల ఎంపికలో తన ఆధిపత్యాన్ని చూపించేందుకు కీలక దశగా మారనుందంటున్నారు. అక్టోబర్ నెలలో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక జరగనుందని కేటీఆర్ స్వయంగా ప్రకటించడం, ఆయనే పార్టీలోని కీలక నిర్ణయాలన్నింటినీ తీసుకుంటారన్న సంకేతాలను ఇస్తోంది. ఈ నేపథ్యంలో టిక్కెట్ల కేటాయింపు నుంచి ఎన్నికల వ్యూహాల దాకా అన్ని విషయాల్లో కేటీఆర్ పాత్రే ప్రధానంగా మారుతుందని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో కీలక నేతలు, నాయకులు ఇప్పటికే కేటీఆర్ చుట్టూ తిరుగుతుండడం, ఆయనను ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రయత్నాలు సాగిస్తుండటం చూస్తుంటే… వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సారథి ఎవరో స్పష్టమవుతోందంటున్నారు.