30.6 C
Hyderabad
Friday, September 18, 2026

Live Video

spot_img

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత గెలుపు సాధ్యమా?

ప్రస్తుతం తెలంగాణలో జరగబోతున్న ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో 3,41,313 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే, ఉపాధ్యాయ నియోజకవర్గం పరిధిలో 25,921 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రుల నుంచి మొదటి ప్రాధాన్యతతో అభ్యర్థి గెలవాలంటే ఒక లక్షా 71 వేల ఓట్లు అభ్యర్థికి రావాల్సి ఉంటుంది. పట్టభద్రుల బరిలో 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జాతీయ, రాష్ర్ట పార్టీల నుంచి 10 మంది బరిలో ఉన్నారు. ప్రతి అభ్యర్థి తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

గతంలో కంటే ఈసారి ఓట్ల సంఖ్య పెరగడంతో మొదటి ప్రాధాన్యతపై గెలవడం కత్తిమీద సామే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీ అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్ధులు ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితలను చూస్తే అభ్యర్థుల విజయావకాశాలు రెండవ ప్రాధాన్యత ఓట్ల మీదే ఆధారపడనుందని తెలుస్తోంది. మొదటి ప్రాధాన్యతలో 51 శాతం ఓట్లు రాకుంటే రెండవ ప్రాధాన్యత ఓట్లు, కింది అభ్యర్థి నుంచి లెక్కిస్తూ ఎలిమినేట్ చేస్తుంటారు. ఇలా లెక్కింపు చేస్తున్న సమయంలో 51 శాతం ఓట్లు సాధించిన వాళ్లు గెలుపొందినట్లు ప్రకటిస్తారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కూడా మొదటి ప్రాధాన్య తతో గెలవడం ప్రస్తుతం ఉన్న పోటీని బట్టి చూస్తే అసాధ్యమనే చెప్పవచ్చు. ఈ రెండు నియోజకవర్గాల్లో సైలెంట్ ఓటింగ్ జరిగితే మాత్రం అభ్యర్థులు మొదటి ప్రాధాన్యతతోనే గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థుల గెలుపును సవాల్ తీసుకుని విస్తృత ప్రచారం చేస్తుండడంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఓటర్ల పాత్ర కీలకం కానుంది. దాదాపు సగం ఓట్లు ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఉన్నాయి. ఇందులో జగిత్యాల జిల్లాలో 35,281 ఓట్లు, పెద్దపల్లి జిల్లాలో 31,037 ఓట్లు, కరీంనగర్ జిల్లాలో 71,545 ఓట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 22,397 ఓట్లు ఉన్నాయి. ఇక్కడి ఓట్లే కీలకం కానుండడంతో అభ్యర్థులు కరీంనగర్ ఉమ్మడి జిల్లాను కలియ తిరుగుతూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తు న్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com