38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

టీడీపీ, జనసేన విడిపోయినట్లేనా?

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అధినాయకత్వం లెవెల్‌లో అంతా బాగానే ఉంది. అన్ని పార్టీల అధినేతల కెమిస్ట్రీకి ప్రాబ్లం ఏమీ లేదు. కానీ, ఆ నియోజక వర్గంలో మాత్రం టీడీపీ, జనసేన పార్టీల మధ్య పరిస్థితి ఉప్పూ నిప్పులా మారింది. అక్కడ రెండు పార్టీలు విడిపోయినట్లే అన్న చర్చ జోరుగా సాగుతోంది.

వాస్తవానికి పవన్‌ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే, అక్కడ తెలుగుదేశం పార్టీ నేత ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ తన సీటును త్యాగం చేసి పవన్‌ కల్యాణ్‌కు పొత్తులో భాగంగా సీటు అప్పగించారు. అంతేకాదు.. పవన్‌ కల్యాణ్‌ను అన్నిరకాలుగా సపోర్ట్‌ చేసి గెలిపించారు. అయితే, అప్పటినుంచి పిఠాపురం వర్మకు ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ మంచి పదవి ఇస్తారన్న చర్చ జరిగింది. కానీ, ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్నా.. వర్మ పరిస్థితిలో మార్పు లేదు. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ పదవి చేజారి పోయింది. ఆ తర్వాత జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

జనసేన ఆవిర్భావ దినోత్సవ దినోత్సవం రోజున పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సమావేశం తర్వాత రాష్ట్రంలో కూటమిలోని ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ, జనసేన క్యాడర్ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. పిఠాపురం వేదికగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు రెండుపార్టీల క్యాడర్ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే పరిస్థితిని తెచ్చి పెట్టింది. అటు.. అధిష్టానం పరంగా చూస్తే.. పార్టీ అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య కెమిస్ట్రీ బాగానే ఉన్నప్పటికీ.. క్యాడర్ మాత్రం పిఠాపురం సభ తరువాత పూర్తిగా విడిపోయినట్లే అనిపిస్తోంది. ఎందుకంటే.. సోషల్ మీడియాలో రెండు పార్టీల కార్యకర్తల పోస్టింగ్‌లు చూస్తుంటే అదే అవగతమవుతోంది.

పిఠాపురంలో పవన్‌ కల్యాణ్ గెలుపు ఎవరి వల్ల? అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఈ వాదనపై ఎవరికి తోచినట్లు వాళ్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌ పిఠాపురంలో మాత్రమే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా కాక రేపుతున్నాయి. జనసేన జయకేతనం సభలో పవన్ కల్యాణ్‌ సహా ఆయన సోదరుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఉష్ణోగ్రతల కంటే గరిష్టంగానే రెండు పార్టీల్లో హీట్‌ పుట్టించాయి.

నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని తానే నిలబెట్టానని పవన్ కళ్యాణ్ అన్న కామెంట్లు ఒక వైపు.. పవన్‌ కల్యాణ్‌ను పిఠాపురంలో తానే గెలిపించామని ఎవరైనా అనుకుంటే అది వాళ్ల ఖర్మ అని.. టీడీపీ నాయకుడు వర్మను ఉద్దేశించి నాగబాబు పరోక్షంగా చేసిన కామెంట్లు మరోవైపు.. హీట్‌ పుట్టించాయి. ఇద్దరు అన్నదమ్ములు చేసిన ఈ కామెంట్లపై ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు తెగ బాధపడిపోతున్నారు. తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నలభై ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఒకరు నిలబెట్టేది ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమకు 175 నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు, క్యాడర్ బలంగా ఉందని, జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉందో చెప్పాలంటూ టీడీపీ శ్రేణులు నిలదీస్తున్నారు. ఈ విషయాలు తెలియకుండా మాట్లాడితే ఊరుకోబోమంటూ ఒకరకంగా వార్నింగ్ లు ఇచ్చినట్లే వారి కామెంట్స్ కనపడుతున్నాయి.

అయితే, జనసేన కేడర్ కూడా తెలుగు తమ్ముళ్లకు ధీటుగానే సమాధానం ఇస్తోంది. వాస్తవానికి జైల్లో ఉన్న చంద్రబాబును పవన్ కల్యాణ్ పరామర్శించడం దగ్గర నుంచి కూటమి ఏర్పాటు వరకూ ఆయన చేసిన కృషిని మరిచిపోతే ఎలా? అని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. కష్టకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీని పవన్ కల్యాణ్ ఆదుకున్న విషయాన్ని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందేనని, ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేం ఉందని నిలదీస్తున్నారు. తాము కష్టపడి పనిచేయడం, తక్కువ సీట్లకే పోటీ చేయడం, ఉభయ గోదావరి జిల్లాల్లో తమకు పట్టు ఉన్నప్పటికీ ఓట్లు చీలకుండా కూటమి గెలుపు కోసం కారణమయ్యామని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో వాదిస్తున్నారు.

దీంతో .. కూటమి ప్రభుత్వం మధ్య అగాధం ఏర్పడుతుందనే ఆందోళన ఇరు పార్టీల ముఖ్య నేతల్లో కనిపిస్తోందంటున్నారు. నాగబాబు విషయాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోయినా.. వర్మ చేసిన త్యాగాన్ని ఆయన కించపర్చడం ఏంటని టీడీపీ క్యాడర్ గుర్రుగా ఉంది. గతంలో వర్మ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఎవరికి ఎంత శాతం ఓట్లు వచ్చాయో తెలుసుకుంటే బాగుంటుందని కూడా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు సూచిస్తున్నారు. కూటమి అంటే కలిసి పోటీ చేయడం, కలిసి పనిచేయడమేనని, అంతే తప్ప.. ఏ ఒక్కరి వల్లనో విజయం సాధ్యం కాలేదని, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని భావించి జనం ఓట్లేశారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇదే సమయంలో జనసేనను కించపరిస్తే నష్టపోయేది మీరేనంటూ జనసైనికులు కూడా హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద జయకేతనం సభ మాత్రం రెండు పార్టీల శ్రేణుల మధ్య దూరం పెంచిందన్నది మాత్రం స్పష్టమవుతోంది. ఇరు పార్టీల నేతలు, సోషల్ మీడియా బాధ్యులు కూడా సంయమనం పాటిస్తేనే మంచిదని, లేకుంటే ఇరువురికి నష్టమే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com