తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదన్న నిబంధనను ఈసారి తొలగించారు. ఐదు నిమిషాలు అలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గంట ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థుల హాల్ టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఇంటర్ పరీక్షలు ఈ నెల 25కి ముగిననున్నాయి. ఫస్టియర్, సెకండియర్ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
ఈ మేరకు అధికారులు రాష్ట్రంలో 1,532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో అత్యధికంగా హైదరాబాద్ లో 244, రంగారెడ్డి జిల్లాలో 185, మేడ్చల్ జిల్లా లో 150 కేంద్రాలు ఉన్నాయి. అయితే పరీక్షకు వారం ముందే ప్రశ్నా పత్రాలు, ఓఎంఆర్ ఆన్సర్ షీట్లు జిల్లా కేంద్రాలకు చేరాయి. ఒక్క నిమిషం లేట్ నిబంధనను ఈసారి ఇంటర్మీడియట్ బోర్డు సడలించింది. ఈ మేరకు 9.05 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఎగ్జామ్ సెంటర్లలోకి స్మార్ట్ వాచ్ లు, మొబైల్ ఫోన్లు ఎలక్ట్రికల్ పరికరాలు అనుమతించబోమని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని అన్నారు.