రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యత ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. నాంపల్లి లోని తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో పలువురు జర్నిలిస్టుల కుటుంబాలకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. పలువురికి పెన్షన్ల చెక్కులు పంపిణీ చేయగా.. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిరుదపేదలైన జర్నలిస్టులు, వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
నియోజక వర్గాల స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులను ఆదుకునేందుక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని పొంగులేటటి చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ప్రెస్ అకాడమీ భవనాన్ని మరమ్మత్తులు పూర్తిచేసి ఈనెలాఖరిలోగా ప్రారంభిస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వచ్చిన వడ్డీ ఆధారంగా ఇప్పటివరకు జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.22కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.