- ప్రపంచంలో 11 శాతం గోల్డ్ నిల్వలు మన మహిళల దగ్గరే..
- టాప్ ఫైవ్ దేశాలను తలదన్నిన భారతీయ మహిళ..
- ఆ అయిదు దేశాల సత్తా కలిపితే భారతీయ మహిళలు
2024 ఇయర్ ఎండింగ్ లో భారతీయ మహిళల సత్తా బయటపడింది.అదీ బంగారం విషయంలో.. దేన్నైనా వదులుకుంటారు కానీ భారతీయ మహిళకు బంగారమంటే సర్వస్వం.. అత్యంత విలువైన సంపద.. అందుకే మంచివాళ్లని బంగారంతో పోలుస్తారు. సర్వం కూడబెట్టి కొంచమైనా బంగారం కొని దాచుకోవడం, అలంకరణలకు వాడుకోవడం చాలా చాలా కామన్. అయితే భారతీయ మహిళలు ఈ ఇంట్రెస్ట్ తోనే ప్రపంచంలో అరుదైన రికార్డును సాధించారు. ప్రపంచంలో టాప్ అయిదు దేశాలను మన మహిళామణులు దాటేశారు. అదే అండీ… బంగారం విషయంలో ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారం నిల్వలలో దాదాపు 11 శాతం మన ఆడవాళ్ల దగ్గరే ఉందని తాజా లెక్కలు చెబుతున్నాయి. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, రష్యా ఈ అయిదు దేశాల్లో ఉన్న బంగారం కంటే భారతీయ మహిళలు అదీ దక్షిణాది మహిళల దగ్గర ఎక్కువ బంగారం నిల్వలున్నాయని ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. తరాల తరబడి వారసత్వంగా వచ్చే బంగారు ఆభరణాలను అపురూపంగా దాచుకోవడం మన భారతీయ మహిళలకు ఒక అలవాటు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఒక విలువైన ఖనిజం బంగారం. పెళ్ళిళ్లు, ఫంక్షన్లకు మన మహిళలు ఎంత అందంగా తయారవుతారో, ఏరికోరి ఎన్నెన్ని నగలు ధరిస్తారో అందరికీ తెలిసిందే. మన ఆచారాల్లోనూ బంగారం వాడకం ఎక్కువే. పెళ్లిళ్లలో పెట్టుపోతల్లో బంగారం ఇవ్వడం, ఈవెంట్లలో బహుమతుల రూపంలో బంగారు ఆభరణాలు ఇవ్వడం, అలాగే పితృకార్యాల్లో త్రుణమో, ఫణమో బంగారం సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తాతలు, తండ్రుల నాటి స్వర్ణా భరణాలను ఆధునిక పోకడలకు అనుగుణంగా మార్చుకుని వాడుకుంటారు తప్పితే వాటిని అత్యవసరాలకు సైతం ఆఖరి దశలో మాత్రమే కుదువపెట్టడం, అమ్మడం లాంటివి చేస్తుంటారు. సంపన్న వర్గాలయితే బంగారాన్ని ఆభరణాలతో పాటు బిస్కట్లు, గోల్డ్ బార్ ల రూపంలో నిల్వ చేసుకుంటారు. అలాగే సులభమైన పెట్టుబడి కూడా బంగారమే. స్థిర, చర ఆస్తులకన్నా ఇప్పడు బంగారం బిస్కట్లు, బార్లు కొని, దాచుకోవడం బాండ్ల రూపంలో ఇన్వెస్ట్ చేయడం కూడా మనం చూస్తున్నాం.
ఆ అయిదుగురికంటే మనమే టాప్..
ప్రపంచంలో ఉన్న టాప్ అయిదు దేశాలలో ఉన్న బంగారం నిల్వలకంటే మన దగ్గర ఎక్కువ ఉన్నాయని తాజా నివేదికలు చెబుతున్నయి. అమెరికాలో 8 వేల టన్నులు, జర్మనీలో 3,300 టన్నులు, ఇటలీలో 2,450 టన్నులు, ఫ్రాన్స్ దగ్గర 2,400 టన్నులు, రష్యా దగ్గర 1,900 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇక భారత్ విషయానికొస్తే మన దేశంలో దాదాపు 24,000 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఇది టాప్ ఫైవ్ దేశాలకంటే ఎక్కువ. ఇక మన దేశంలో ఉన్న బంగారం నిల్వల్లో 40 శాతం దక్షిణాది మహిళల దగ్గరే ఉన్నాయి. దీనిలో తమిళనాడు రాష్ట్రంలో దక్షిణాదిలోనే ఎక్కువగా 28 శాతం బంగారం నిల్వలున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే దేశ జీడీపీలో 40 శాతం విలువచేసే వాటా మహిళల దగ్గరే ఉంది. ఆక్స్ ఫర్డ్ గోల్డ్ గ్రూప్ అధ్యయనాల్లో ఈ వివరాలన్నీ బయటపడ్డాయి. మన ఇన్ కం టాక్సు నిబంధనల ప్రకారం పెళ్లయిన మహిళలు దాదాపు 500 గ్రాముల వరకూ ఎలాంటి పన్నులు కట్టక్కర్లేకుండానే నిల్వ చేసుకోవచ్చు.
నెటిజన్ల సరదా వ్యాఖ్యలు
ఈ నివేదికల పట్ల సోషల్ మీడియాలోనూ నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. మన ఆడాళ్లా మజాకా అని కొందరు కామెంట్ చేస్తుంటే.. ఈ వివరాలేవీ మన ఆర్థిక మంత్రిగారికి తెలియనివ్వకండి కొత్తరూల్స్ పెట్టి టాక్సులతో బాదేస్తారు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ప్లీజ్ మన ఆర్థిక మంత్రికి లేని పోని ఐడియాలు ఇవ్వకండి అని మరొకరు స్పందించగా ఈ ఆడాళ్లందరినీ కలిపి ఓ దేశంలో పెడితే ప్రపంచంలోనే టాప్ కంట్రీ అయిపోతుంది అని మరొకరు స్పందించారు. మరికొందరు భారతీయ నారీశక్తి పవర్ అది అంటూ కామెంట్ చేశారు.