ఆసియాలోని సంపద చార్టులలో భారతీయులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కొన్నేళ్లుగా ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంటున్నారు. తాజాగా ఈ జాబితాలో పలు భారతీయ కుటుంబాలు కూడా చేరాయి. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్. ప్రస్తుతం డోస్ చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు. ఆయనతో అనేక మంది పోటీ పడుతున్నారు. కానీ, రెండు మూడేళ్లుగా మస్క్ మాత్రమే అగ్రస్థానంలో ఉంటున్నారు.
ఇక ఆసియా ధనవంతుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ టాప్ వన్‌లో ఉన్నారు. ఆయనతో అనేక మంది పోటీ పడుతున్నా.. అగ్రస్థానంలో అంబానీ కుటుంబమే ఉంది. తాజాగా బ్లూమ్‌బర్గ్ ఆసియాలో అత్యంత సంపన్నులైన 20 మంది జాబితా విడుదల చేసింది. ఇందులో ఆరుగురు భారతీయులు ఉన్నారు. అంబానీ కుటుంబం 90.5 బిలియన్ డాలర్ల సంపదతో బ్లూమ్‌బర్గ్ చార్టులో అగ్రస్థానంలో ఉంది. ఈ కుటుంబానికి చెందిన ప్రధాన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్. దివంగత పారిశ్రామికవేత్త ధీరూభాయ్ అంబానీ కుమారుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలో ఈ సంస్థ నడుస్తోంది. అతని నివాసం 27 అంతస్తుల భవనం.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసంగా రికార్డులకెక్కింది. ఇక, బ్లూమ్ బర్గ్ జాబితాలో రెండోస్థానంలో థాయిలాండ్‌లోని చీరవనాంట్ కుటుంబం చోటు సంపాదించింది. చీరవనాంట్ మొత్తం సంపద 42.6 బిలియన్ డాలర్లు. ఇది అంబానీల సంపదలో సగం కంటే తక్కువ. ఈ కుటుంబం ఆహారం, రిటైల్, టెలికాం యూనిట్లను నిర్వహించే చారోయెన్ పోక్ఫాండ్ గ్రూప్‌ను కలిగి ఉంది. ఇండోనేషియాకు చెందిన హార్టోనో కుటుంబం 42.2 బిలియన్ల డాలర్ల సంపదతో తదుపరి స్థానంలో ఉంది. ఇక, ఈ జాబితాలో నాలుగవ స్థానంలో భారతదేశానికి చెందిన మిస్త్రీ కుటుంబం ఉంది. ఈ కుటుంబం సంపద 37.5 బిలియన్ల డాలర్లు. ఈ కుటుంబానికి చెందిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఇంజనీరింగ్ నిర్మాణంతో సహా బహుళ రంగాలలో వ్యాపారం నిర్వహిస్తోంది. భారతదేశంలోని అతిపెద్ద సమ్మేళన సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్‌లో ఈ కుటుంబం గణనీయమైన వాటాను కలిగి ఉంది. ఐదవ స్థానంలో హాంకాంగ్‌లోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటైన సన్ హంగ్ కై ప్రాపర్టీస్‌ను కలిగి ఉన్న హాంకాంగ్‌కు చెందిన క్వాక్ కుటుంబం ఉంది. ఈ కుటుంబ సంపద 35.6 బిలియన్ల డాలర్లు. తైవాన్‌కు చెందిన త్సాయ్ కుటుంబం 30.9 బిలియన్ల డాలర్లతో ఆరవ స్థానంలో ఉంది. ఈ కుటుంబం సంపద ప్రధానంగా కాథే లైఫ్ ఇన్సూరెన్స్, ఫుబన్ ఇన్సూరెన్స్ నుండి వచ్చింది. అదే సమయంలో రియల్ ఎస్టేట్, టెలికాం వంటి ఇతర రంగాలలోకి కూడా విస్తరించింది. భారతదేశానికి చెందిన జిందాల్ కుటుంబం 28.1 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఆసియా సంపన్నుల జాబితాలో ఏడవ స్థానంలో ఉంది. ఇది ఉక్కు, శక్తి, సిమెంట్, క్రీడలు వంటి రంగాలలో వ్యాపార ప్రయోజనాలను కలిగి ఉన్న ప్రసిద్ధ జిందాల్ గ్రూప్‌ను కలిగి ఉంది. థాయ్‌లాండ్‌కు చెందిన యూవిధ్య కుటుంబం ఎనిమిదో స్థానంలో నిలిచింది. వీరికి టీసీపీ గ్రూప్ ఉంది. వీరి సంపద 25.7 బిలియన్ల డాలర్లు. ఈ గ్రూప్ రెడ్ బుల్ అనే ఎనర్జీ డ్రింక్‌ను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తుంది. ఈ జాబితాలో బిర్లా కుటుంబం తొమ్మిదవ స్థానంలో ఉంది. 23.0 బిలియన్ల డాలర్ల నికర విలువతో, ఆదిత్య బిర్లా గ్రూప్ ఆర్థిక సేవలు, మెటల్, రిటైల్ వంటి పరిశ్రమలలో తనదైన స్పెషాలిటీ సంపాదించుకుఉంది. శామ్సంగ్ను నడుపుతున్న దక్షిణ కొరియాకు చెందిన లీ కుటుంబం 22.7 బిలియన్ల డాలర్ల సంపదతో జాబితాలో పదవ స్థానంలో నిలిచింది. అలాగే, బజాజ్, హిందూజా కుటుంబాలు వరుసగా 20.1 బిలియన్లు 15.2 బిలియన్ల డాలర్ల నికర విలువతో ప్రపంచ వ్యాపార వేదికపై భారతదేశం ప్రభావాన్ని ప్రదర్శిస్తూ టాప్ 20లో ఉన్నాయి.