ఎప్పుడు చూడు ఇదే ఆట…ఇదే తీరు…దశాబ్దాలు మారినా టీమ్ ఇండియా ఆట తీరు మారడం లేదు. అంతవరకు బాగా ఆడి, సరిగ్గా ఆడాల్సిన సమయంలో చేతులెత్తేస్తారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కి ఏడాది వరకు నెంబర్ వన్ స్థానంలో ఉండి, సరిగ్గా అర్హత సాధించే సమయంలో, పతనం దిశగా సాగిపోయారు. సొంత దేశంలో న్యూజిలాండ్ తో సిరీస్ ఓడిపోవడం కొంప మీదకు వచ్చింది. ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ లో కూడా పీకలవరకు తెచ్చుకున్నారు. అయితే ఇంకా అక్కడక్కడ చెదురుమదురు ఆశలు మిగిలే ఉన్నాయి.
డబ్ల్యూటీసీ ఫైనల్: భారత్ పరిస్థితేమిటి?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ రేస్ లో మొన్నటి వరకు నెంబర్ వన్ లో ఉండి, 72.82 స్థానం నుంచి ఒక్కసారి 55.88 శాతానికి పడిపోయింది. అంతేకాదు మూడో టెస్టు డ్రా చేసుకోవడంతో కనీసం ర్యాంకింగులో మూడో స్థానంలో నిలిచింది. దీంతో శ్రీలంక, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ అన్నింటికి దారిచ్చినట్టయ్యింది.
ఇప్పుడెక్కడున్నాం?
ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా 63.33 శాతంతో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 58.89 తో రెండో స్థానంలో ఉంది. భారత్ 55.88 శాతంతో తర్వాత స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 48.21శాతంతో నాలుగో స్థానంలో ఉండగా, శ్రీలంక 45.45శాతంతో ఐదో స్థానంలో ఉంది. ఇక ఇంగ్లాండ్ (43.18), పాకిస్తాన్ (33.33) తర్వాత వరుసగా ఉన్నాయి.
ఆస్ట్రేలియా ఈ టూర్ తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. సౌతాఫ్రికా తదుపరి సొంతగడ్డ మీద పాకిస్తాన్ తో తలపడనుంది. ఈ రెండికి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందువల్ల తొలిరెండు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.
మళ్లీ మొదలైన…వాళ్లు గెలవాలి? వీళ్లు ఓడాలి లెక్కలు
భారతదేశంలోని క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ ఈ లెక్కలతో భలే పని పడుతుంటుంది. ప్రతిసారి వాళ్లు ఓడాలి, వీళ్లు గెలవాలి? అప్పుడైతే మనోళ్లు ఫైనల్ కి చేరతారు..ఈ లెక్కలు వేసుకుంటూనే ఉంటారు. తమ క్రికెట్ బుర్రకి పదును పెడుతుంటారు. విషయానికి వస్తే అక్కడ పాకిస్తాన్ చేతిలో సౌతాఫ్రికా ఒక టెస్టు మ్యాచ్ అయినా ఓడిపోవాలి. అలాగే శ్రీలంక ఎలాగైనా ఒక టెస్టు మ్యాచ్ అయినా ఆస్ట్రేలియాపై గెలవాలి.
అప్పుడు టాప్ లో ఉన్న వీరిద్దరి పర్సంటేజ్ లు తగ్గుతాయి. దాంతో టీమ్ ఇండియాకి లైన్ క్లియర్ అవుతుంది. అయితే అవన్నీ జరగాలంటే, ఇప్పుడు మిగిలిన బోర్డర్ గవాస్కర్ రెండు టెస్టులు ఇండియా తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. లేదంటే ఇంక ఆలోచించాల్సిన పని కూడా లేదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.