పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రమూకలు చేసిన దాడులకు భారత ప్రభుత్వం అదను చూసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని ఒవైసీ పేర్కొన్నారు. పహల్గాం లాంటి దాడులు మరోసారి జరగకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులకు మన సైన్యం సరైన బదులిచ్చిందని తెలిపారు. ఇంతటితో ఆగవద్దని.. మళ్లీ ఉగ్రదాడులు జరగకండా పాకిస్తాన్‌కు కఠినమైన గుణపాఠం చెప్పాలని ఒవైసీ ఆకాంక్షించారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలతో పాటు వారి మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జై హింద్ అంటూ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
పహల్గాం దాడిని ఒవైసీ తీవ్రంగా ఖండించారు. భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము మద్దతిస్తామన్నారు. భారత ప్రభుత్వం ముందుగా చెప్పినట్లుగానే.. పాకిస్తాన్, పీఓకేలో భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను ఆయన సమర్థించారు.