భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్వాగతించారు. ఉగ్రవాదానికి మతం, కులం, దేశం ఉండదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఎప్పటినుంచో ఉగ్రవాదుల చేతుల్లో ఉందని, బెనజీర్ భుట్టోను హత్య చేసినవారు కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులేనని గుర్తు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందని, అటువంటి స్థావరాలను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఆపరేషన్ సిందూర్ భారత ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉందని కూనంనేని చెప్పారు. కాశ్మీర్ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని, అప్పుడే అమాయకుల ప్రాణాలు దుర్మరణం చెందే పరిస్థితులు తగ్గుతాయని ఆయన అన్నారు. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ప్రభుత్వం త్వరగా ఆలోచించాల్సిన అవసరం ఉందని, అన్ని పార్టీలతో సలహాలు తీసుకుని ముందుకు సాగాలని సీపీఐ తరపున సలహా ఇచ్చారు. భారతదేశం సహనానికి మారుపేరని, కానీ ఆ సహనానికి కూడా హద్దులు ఉంటాయని హెచ్చరించారు.