23 C
Hyderabad
Wednesday, October 28, 2026

Live Video

spot_img

ఏపీలో… బీహార్, యూపీ తరహా నేరప్రవృత్తి

  • పోలీసులపైకి దూసుకుపోయిన కారు
  • గంజాయి మూకల ఘాతుకం
  • కాకినాడ జిల్లా కిర్లంపూడిలో దారుణం
  • తెలుగు రాష్ట్రాల్లోకి… ఉత్తరభారత మాఫియా సంస్కృతి వస్తోందా?
  • ఆందోళనలో ప్రజలు, పోలీసు వర్గాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు వస్తున్నారన్నా, ఎక్కడైనా కనిపించినా ప్రజలకు భయం, గౌరవం అన్నీ ఉంటాయి. పోలీసులు కూడా ఆ భావాలను అలాగే నిలబెట్టుకుంటూ, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ నెట్టుకు వస్తున్నారు. అయితే తాజాగా ఏపీలోని కాకినాడ జిల్లా కిర్లంపూడి వద్దనున్న కృష్ణవరం టోల్ గేట్ వద్ద జరిగిన ఘటనతో రాష్ట్ర పోలీసు వర్గాలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల క్రైం కల్చర్ మన రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తోందా? అనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ఇంతకీ ఏం జరిగిందంటే… కొత్త సంవత్సరం సందర్భంగా విధుల్లో భాగంగా పోలీసులు టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. అన్ని వాహనాల తరహాలోనే అటుగా వచ్చిన ఒక కారుని ఆపారు. అయితే డ్రైవరు కారును పక్కకు తీసినట్టు తీసి, ఒక్కసారి ఎక్సలేటర్ రైజ్ చేసి, సినిమా స్టయిల్ లో వేగంగా ముందుకు ఉరికించాడు. ఈ అనూహ్య ఘటనను ఊహించని ఇద్దరు కానిస్టేబుళ్లు, దానిని ఆపడానికి ప్రయత్నించారు. అంతే వారిద్దరినీ కారు ఈడ్చుకుపోయింది.

అందులో ఒకరు ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ మరో ట్విస్టు ఏమిటంటే, ఇంత పెద్ద ఘటన జరిగిన వెంటనే స్టేషన్ సీఐ ఏం చేశాడంటే, విషయాన్ని ఎస్పీకి చెప్పలేదు. పోలీసులపైకి కారు దూసుకెళితే, తనకు చెప్పకుండా ఏం చేస్తున్నావని, ఆయన సీరియస్ అయ్యి, హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అయితే నిందితులు కారుని రాజానగరం వరకు తీసుకెళ్లి, అక్కడ జాతీయ రహదారి పక్కన పడేసి, తప్పించుకున్నారు. కానీ తర్వాత నిందితులను పట్టుకున్నట్టు తెలిసింది. కారులో ఉన్నవారు నిజంగానే ఉత్తర ప్రదేశ్ కి చెందినవారుగా భావిస్తున్నారు. కారులో గంజాయి ఉందని అనుమానిస్తున్నారు.

అయితే, ఇంతవరకు జరిగినదంతా ఓకే…కానీ పోలీసులను లెక్క చేయకుండా, వారిని ఈడ్చుకుంటూ వెళ్లడమనేది.. తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రధమమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తరహాలో పోలీసులపైకి ఎదురుతిరగడం, దాడులు చేయడం, వారిని లెక్క చేయకపోవడం, ఈడ్చుకు పోవడం లాంటి నేర దృశ్యాలు సాధారణంగా మనం ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లోనే చూస్తుంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గంజాయి మూకలకు ఉత్తర భారత నేర సామ్రాజ్య రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియాకు కుదిరిన స్నేహ బంధం కారణంగా ఆంధ్రాలో కూడా పోలీసులుపైకి కార్లు దూకించే సన్నివేశాలు మొదలయ్యాయి.

బుధవారం రాత్రి కిర్లంపూడి వద్ద జరిగిన ఇటువంటి మాఫియా స్వభావం కలిగిన సంఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. మన రాష్ట్రంలోని గంజాయి స్మగ్లింగ్ ముఠా ఇతర రాష్ట్రాల నేరస్తులను ఇక్కడకి తీసుకు వచ్చి రాష్ట్రంలో భయోత్పాతం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ …క్రైం కల్చర్ నెమ్మది నెమ్మదిగా ఇక్కడకు తీసుకు వస్తున్నారు. దీంతో అందరి వెన్నులో వణుకుపుడుతోంది. అదే జరిగితే పోలీసుల ప్రాణాలకు రక్షణ ఉండదని అంటున్నారు. ఇది రానున్న కాలంలో ప్రమాదకర సంకేతాలను అందిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

వైసీపీ పాలనలో ఐదేళ్లు…కూటమి పార్టీలైన తెలుగుదేశం. జనసేన, బీజేపీ అంతా కలిసి రాష్ట్రం గంజాయి సాగుకి అడ్డాగా మారిందని హోరెత్తించారు. యువత దారి తప్పుతోందని, గంజాయికి బానిసలుగా మారుతున్నారని, యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళనలు వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల్లో లేనిపోని భయాలన్నీ సృష్టించారు. ఎవరినీ నిద్ర పోనివ్వలేదు.

తాము అధికారంలోకి వస్తే, గంజాయి అనేది లేకుండా చేస్తామని, సాగు చేసినవాళ్ల అంతు చూస్తామని, కేసులు పెడతామని, తొక్కి నారతీస్తామని ఢంకా భజాయించి మరీ చెప్పారు. కానీ నేటి ఘటన చూస్తే, వైసీపీ పాలనను మించిన క్రైం జరగడంతో, దీనికేం సమాధానం చెబుతారని అప్పుడే నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

చిన్నారిపై అత్యాచారం జరిగితే, హోంమంత్రి అనితను పట్టుకుని దులిపేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి సినిమా ఫక్కీలో జరిగిన ఈ ఘటనపై ఎలా స్పందిస్తారని అప్పుడే సోషల్ మీడియాలో ప్రశ్నలు ప్రారంభించారు. అలాగే సీఎం చంద్రబాబునాయుడు స్పందనపై కూడా నెటిజనులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంత పెద్ద ఘటన జరిగితే,  మసిపూసి మారేడుకాయ చేయాలని చూడటం మరోవైపు జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా ఏపీలో గంజాయి సాగు, రవాణా కొత్త పుంతలు తొక్కుతోందని అంటున్నారు. కొత్త నేరచరిత్రను లిఖిస్తోందని వ్యాక్యానిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మరింతగా గంజాయి అక్రమ రవాణా పెరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి నేరప్రవృత్తిని ఆదిలోనే అణచివేయకపోతే సామాన్య ప్రజానీకం కూడా అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. పోలీసులు అప్రమత్తంగా లేకపోతే, రాబోవు రోజుల్లో మరిన్ని దారుణాలు చూడాల్సి వస్తుందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com