-
రాహుల్‌ని చూసి భయపడుతోన్న ప్రధాని మోడీ, ఎన్డీఏ ప్రభుత్వం
-
ఏఐసీసీ ప్లీనరీ బ్యాలెట్ పేపర్ నిర్ణయానికి భయపడుతోన్న బీజేపీ
-
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలే కాంగ్రెస్‌ను గెలిపించుకుంటారు
-
దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబానికి దేశ ప్రజలు అండగా ఉన్నారు.
-
ఈడీ ఆఫీస్ వద్ద ధర్నాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఏఐసిసి అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ లపై అక్రమ కేసులు పెట్టి దేశవ్యాప్తంగా కులగణన జరగకుండా అడ్డుకోవాలని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీ చూస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ గురువారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఏఐసిసి ప్లీనరీ సమావేశంలో ఏఐసిసి అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలను చూసి కేంద్రంలో ఉన్న బిజెపి, ప్రధాని మోడీ భయపడుతున్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి 56 శాతం బీసీలు ఉన్నారని, మిగతా వర్గాల సమాచారాన్ని కూడా లెక్కలతో సహా ప్రకటించి, ఎవరి దగ్గర ఆస్తులు, వనరులు ఉన్నాయో, ఏ వనరులు ఎవరికి పంచాలనేది లెక్కల ద్వారా స్పష్టంగా చెప్పడమే కాకుండా అమలు చేయబోతున్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న రాహుల్ గాంధీ పిలుపుకు మోడీ భయపడుతున్నాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణన సర్వే దేశవ్యాప్తంగా చేయాలంటే ప్రధాని మోడీ స్నేహితులైన అంబానీ ఆదానీలకు దోచి పెడుతున్న దేశ సంపద, వనరులు ఇక ముందు తాడిత, పీడిత, అణగారిన వర్గాలకు చెందిన దేశ ప్రజలందరికీ పంచాల్సి వస్తేదేమో..? ఆ పరిస్థితి వస్తే కార్పొరేట్ సంస్థలతో బతుకుతున్న బిజెపి భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం పట్టుకొని, దేశంలో కుల గణన జరగకుండా అడ్డుకోవడానికి చేసిన కుట్రలో భాగంగానే ఏఐసిసి అగ్రనేతలు రాహుల్, సోనియాలపై అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. అదే విధంగా ఏఐసిసి ప్లీనరీలో అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే దేశవ్యాప్తంగా ఈవీ మిషన్లు కాదు, బ్యాలెట్ పేపర్ కావాలని అడిగారని గుర్తు చేశారు. దేశంలో బ్యాలెట్ పేపర్ లేకుండా ఈవీ మిషన్ల ద్వారా చేస్తున్న కుట్రల వల్ల సామాన్యులందరికీ ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతున్నదని, ఆ నమ్మకాన్ని కలిగించడం కోసం బ్యాలెట్ పేపర్లో తిరిగి తీసుకురావాలని ఏఐసిసి ప్లీనరీలో తీసుకున్న నిర్ణయానికి మోడీ ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు.
త్వరలో జరగబోయే ఎన్నికల్లో గుజరాత్ కు వస్తున్నాం కాచుకో నరేంద్ర మోడీ అని రాహుల్ చేసిన సవాల్ కు బిజెపి నాయకులు, ప్రధాని మోడీ భయపడి రాహుల్ గాంధీని అడ్డుకోవడానికి చేసిన కుట్రలో భాగంగానే అక్రమ కేసులను పెట్టి ఈ.డి విచారణ పేరిట వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో పనిచేస్తున్న వారికి జీతాలు ఇవ్వాలని, కరెంట్ బిల్లులు కట్టాలని రూపాయి, రూపాయి పోగేసి చందాలు వేసుకుని డబ్బులు ఇస్తే కేసులు పెట్టడం న్యాయమా? జర్నలిస్టులకు అండగా నిలబడినటువంటి కాంగ్రెస్ అగ్ర నేతలపై కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అక్రమంగా పెట్టిన ఈ.డి కేసులను సమస్త జర్నలిస్టులు ఎండగట్టాలని కోరారు.
దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబానికి దేశ ప్రజలందరూ అండగా నిలబడ్డారని ఏఐసిసి అగ్ర నేతలు సోనియా రాహుల్ పై అక్రమంగా కేసులు పెట్టి కాంగ్రెస్ శ్రేణుల మనోధైర్యం దెబ్బతీయాలన్న కుట్రను కాంగ్రెస్ సైనికులు తిప్పికొట్టాలన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపిస్తుందన్నారు. ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి అఖిల భారత కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించుకుంటారని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు పెట్టేటువంటి సంస్థలు, వ్యవస్థలను అన్నింటిని కట్టడి చేసి ప్రజాస్వామ్యం కోసం పనిచేసేటువంటి సంస్థలుగా మారుస్తామని చెప్పారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రాహుల్ గాంధీ గారు మీరు పోరాటం చేయండి. మీ వెనకాల మేమంతా కోట్లాదిమంది ఉన్నామని దేశ ప్రజలు రాహుల్ చేస్తున్న పోరాటానికి అండగా ఉన్నారని చెప్పారు.