సీయం రేవంత్ దివాలా వ్యాఖ్యలపై మండిపడ్డ ఈటెల
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల వల్ల తెలంగాణ సమాజం తలిందుకోవాల్సి వస్తోందని, దేశంలో మన పరువు పోతోందని మాజీ ఆర్థిక శాఖ మంత్రి, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ 2014 లో 30 వేల కోట్ల ఓన్ టాక్స్ రెవెన్యూ ఉన్న రాష్ట్రం 11 ఏళ్లలో లక్ష 30 వేల కోట్ల ఆదాయంకు చేరుకుంది అంటే ఇది దివాలా రాష్ట్రమా ? లక్షకోట్ల బడ్జెట్ మూడు లక్షల కోట్లకు పెరగడం దివాలా నా ? అని ఈటల ప్రశ్నించారు. అలాంటి రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి…. ఒక వ్యక్తిని, పార్టీని దృష్టిలో పెట్టుకుని .. ఇవాళ దివాళా తీసిందని పదేపదే చెబుతూ ఆయన దివాళాకోరుతనాన్ని బయటపెట్టుకుంటున్నారని ఈటల విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు యావత్ తెలంగాణ ప్రజలు తలదించుకునేలా, వారి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఉన్నాయన్నారు. పరిపాలన చేతగాక, చేవలేక, అనుభవం లేక, మాటల్లో, చేతల్లో గంభీరత లేని రేవంత్ రెడ్డి.. చివరికి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక దివాళాకోరు రాష్ట్రంగా.. తెలంగాణ ప్రజలను ఎందుకు పనికిరానివారుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాలన చేతకాకపోతే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలానే కొనసాగుతే సందర్భం వచ్చినప్పుడు ప్రజలే కర్రు కాల్చి వాత పెడతారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు.