పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాలు పరస్పరం ఆంక్షలు విధించుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. భారత్‌తో పోల్చుకుంటే పాకిస్తాన్ జనాభా పరంగా, సైనిక పరంగా, ఆయుధాల పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, అంతర్జాతీయ సహకారం పరంగా అన్ని రంగాల్లో వెనకబడే ఉంది. ఇప్పటికే అడుక్కుతినే స్థాయిలో ఉన్న పాకిస్తాన్.. యుద్ధం వస్తే పాతాళానికి పడిపోతుందనే విషయం తెలిసినా.. ఆ దేశం కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయి.. రోజు గడవాలంటే విదేశాలు, విదేశీ సంస్థలు, అంతర్జాతీయ సంస్థల వద్ద చేతులు చాచి అడుక్కుంటోంది.
పాక్ ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో ఉంది. అంతర్గతంగా పాక్‌లో అనేక రాజకీయ, వేర్పాటువాద సవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య సఖ్యత లేదు. ఒకవైపు ప్రత్యేక దేశం కోసం ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న బలూచిస్తాన్.. పాక్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాంటి సమయంలో భారత్‌తో యుద్ధం అంటే పాకిస్తాన్ ఇంకా నష్టపోవాల్సిన పరిస్థితే ఉంటుంది. మరోవైపు.. సైనిక పరంగా, ఆయుధాల పరంగా, రక్షణ శాఖ బడ్జెట్ పరంగా చూస్తే.. భారత్‌తో అసలు పాకిస్తాన్ పోటీపడే స్థితిలో కూడా లేదు.
భారత్ వద్ద 14 లక్షల మంది సైనికులు ఉండగా.. పాకిస్తాన్ వద్ద కేవలం 6.5 లక్షల మంది సైన్యం మాత్రమే ఉంది.
రిజర్వ్ ఫోర్స్‌లు భారత్ వద్ద 11 లక్షలు ఉండగా.. పాకిస్తాన్‌కు కేవలం 5 లక్షలు మాత్రమే ఉన్నాయి.
2024లో భారత రక్షణ బడ్జెట్ 81 బిలియన్ డాలర్లు కాగా.. పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ 11 బిలియన్ డాలర్లు.
ఫైటర్ జెట్‌లు (సుఖోయ్-30 ఎంకేఐ, రఫేల్) భారత్ వద్ద 600 కంటే ఎక్కువ ఉండగా.. పాకిస్తాన్ వద్ద 350 (జేఎఫ్-17, ఎఫ్-16, మిరాజ్) ఉన్నాయి.
యుద్ధ ట్యాంకులు భారత్ వద్ద 4,500కు పైగా ఉండగా.. పాక్ వద్ద కేవలం 2,400 మాత్రమే ఉన్నాయి.
నౌకా శక్తిలో భారత్ వద్ద 1 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, డిస్ట్రాయర్స్, సబ్‌మెరైన్లు ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద నౌకా శక్తి పరిమిత సంఖ్యలోనే ఉంది.
న్యూక్లియర్ ఆయుధాలు భారత్ వద్ద 160 నుంచి 170 ఉన్నట్లు అంచనా ఉండగా.. అదే పాకిస్తాన్ వద్ద 160 నుంచి 165 అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనా. ఒక్క అణ్వాయుధాల విషయంలో మాత్రం భారత్‌ను ఢీకొట్టే సత్తా పాకిస్తాన్‌కు కనిపిస్తోంది.
మిస్సైల్ శక్తిలో భారత్ వద్ద అగ్ని, బ్రహ్మోస్ వంటి అగ్రశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిస్సైళ్లు ఉన్నాయి. అదే పాక్ వద్ద షాహీన్, ఘోరీ, బాబర్ మిస్సైళ్లు ఉన్నాయి.
యుద్ధం గనక ప్రారంభమైతే.. రెండు దేశాలు నష్టపోవాల్సి వస్తుంది. పాక్ వద్ద అణ్వాయుధాలు భారీగా ఉండటం.. తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకసారి అణ్వాయుధాలు ప్రయోగిస్తే.. దాని వల్ల కలిగే నష్టం ఊహించడం చాలా కష్టంగా ఉంటుంది.
పాకిస్థాన్‌లో ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక అస్థిరత నెలకొంది. ఈ తరుణంలో ఆ దేశ పాలకులు ప్రజల్లో పట్టుకోసం కఠినమైన నిర్ణయాలు తీసుకునే ప్రమాదం పొంచి ఉంది.